Breaking News

సంక్రాంతి బరిలో ఐదు పెద్ద సినిమాలు.. థియేటర్లు దొరికేది ఎవరికి?

2 0

కరోనా ఎఫెక్ట్ వల్ల 2022 సంక్రాంతి హీటెక్కనుంది. ఎందుకంటే కరోనా వల్ల వాయిదా పడిన సినిమాలన్నీ సంక్రాంతిని టార్గెట్ చేశాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతి 14న విడుదలవుతుందని శుక్రవారమే చిత్ర యూనిట్ ప్రకటించింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం నిర్మాతలు చాలా టైమ్ తీసుకుంటున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతుందని ఓ పోస్టర్‌ను వదిలారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపైనా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. అయితే షెడ్యూల్ ప్రకారం క్రిష్-పవన్ కాంబినేషన్‌ చిత్రం హరిహరవీరమల్లు సంక్రాంతికి విడుదల కావాలి. అయితే దాని స్థానంలో సాగర్ కె.చంద్ర సినిమా వచ్చి చేరింది. పవన్ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-3’ కూడా సంక్రాంతికే వస్తుంది. ఈ విషయాన్ని నారప్ప సక్సెస్ మీట్‌లో స్వయంగా వెంకటేష్ ప్రకటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో విడుదల కావాలి. కానీ కరోనా వల్ల ప్రణాళిక మారిపోయింది. ఈ నాలుగు పెద్ద సినిమాలకు తోడు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ కూడా సంక్రాంతికే విడుదల కానుంది.

పెద్ద సినిమాలు రావడం వల్ల చిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది. కానీ ఐదు పెద్ద సినిమాలు మూడు, నాలుగు రోజుల గ్యాప్‌లో విడుదల కావడం అంటే థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని సినిమాలు నష్టపోవాల్సి ఉంటుంది. మరి ఏ సినిమా బరిలో నిలిచి విజయవంతం అవుతుందో, ఏ సినిమా బొక్క బోర్లా పడుతుందో రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.