Breaking News

ఏపీ ఆర్థిక పరిస్థితి.. జగన్‌కు ఇక కష్టాలు మొదలైనట్లే..!!

2 0

తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచే ఏపీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను వదులుకునే పరిస్థితి రావడంతోనే ఏపీకి ఈ పరిస్థితి ఎదురైందని అందరికీ తెలిసిన విషయమే. అయితే గత టీడీపీ ప్రభుత్వం కనీసం పెట్టుబడులు తెచ్చేందుకు కాస్తో కూస్తో ప్రయత్నాలు చేసింది. అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ కోరడంతో ప్రజలు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాల కోసం డబ్బులను ప్రజలకు పంచుతూ పోతోంది. కట్ చేస్తే ఈ ఏడాదిలో పరిమితికి మించి రూ.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నాడు పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికి రూ.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంది.

అసలే కరోనా కష్టాలు, ఆపై పెరిగిపోతున్న అప్పుల బాధలు ఏపీని చుట్టుముట్టాయి. రూపాయి అప్పు పుట్టడం కష్టంగా ఉన్న ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులు మళ్లించకుండా బ్రేక్ వేసేసింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను సైతం సకాలంలో చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పీడీ ఖాతాలకు నిధులు మళ్లిస్తూ కాలం వెళ్లదీస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇక రాబోయే రోజులు మరింత కష్టమేనని తెలుస్తోంది.

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం, రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. కేంద్ర పథకాలలో కొన్నింటికి కేంద్రం నేరుగా పూర్తిస్ధాయిలో నిధులు ఇచ్చేవి ఉంటాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలుపుకుని అమలు చేసేవి ఉంటాయి. అంటే రాష్ట్రం కూడా తమ వాటా ఇస్తేనే ఆ పథకం సదరు రాష్ట్రంలో అమలవుతుంది. అయితే కేంద్రం నేరుగా నిధులు పథకాలు ఏపీలో అమలు కావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం వాటికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఏపీ ప్రభుత్వం తమ సొంత పథకాలకు మళ్లించేసుకోవడమే.

ఈ పని గత టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టినా ప్రస్తుత వైసీపీ సర్కారు అంతకుమించి అన్నట్లుగా చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్ర నిధుల మళ్లింపును కొనసాగిస్తోంది. దీంతో కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. అదే సమయంలో ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజల వద్ద మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇకపై ఆ మళ్లింపులకు బ్రేక్ వేయాలని నిర్ణయించిన కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

కేంద్రం కొత్త రూల్ ప్రకారం సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు ఆర్‌బీఐలోని రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలకు చేరతాయి. ఆ తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ నోడల్ ఏజెన్సీలకు బదిలీ చేయాలి. అలాగే కేంద్రం తమ నిధులు విడుదల చేసిన 40 రోజుల్లోపు రాష్ట్రాలు కూడా తమ వాటా నిధులు విడుదల చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ ఏజెన్సీల ఏర్పాటుతో పాటు వాటి కింద అమలు చేసే ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా లబ్ది దారుల ఖాతాలకు చేరాల్సిందే. వీటిలో ఎక్కడ మళ్లింపు జరిగినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సొంత రాబడి మార్గాలు వెతక్కుండా కేంద్రం ఇచ్చే నిధుల్ని ఎడాపెడా సొంత ఖాతాలకు బదిలీ చేసి తమ పథకాలు అమలు చేసుకుంటున్న వైసీపీ సర్కార్ తాజా మార్గదర్శకాలతో ఇరుకున పడేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదల చేస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయకుండా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను మూలన పడేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు కేంద్రం తాజా మార్గదర్శకాలను అమలు చేస్తే మరింత దివాళా తీయడం ఖాయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పటికే 20 రాష్ట్రాలు అంగీకరించిన ఈ మార్గదర్శకాలను తాము మాత్రం అమలు చేయలేమని ఏపీ సర్కారు చెబుతోంది.