నగరాలు, పట్టణాల్లో సాధారణంగా ఇళ్లలో దొంగతనాలు నివారించడానికి చాలామంది సీసీ టీవీ కెమెరాలు ఉపయోగిస్తారు. కానీ పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ సీసీ టీవీ కెమెరాలు అవసరమే అని ఓ రైతు అంటున్నాడు. ఈ మేరకు ఓ పల్లెటూరులో కూరగాయలు సాగు చేసే పొలం వద్ద రైతు సీసీ కెమెరాలు వాడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు తన పొలం వద్ద సీసీ కెమెరాలు పెట్టాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే కొన్నిరోజులుగా తన పొలంలోని కూరగాయలు కిలోలకు కిలోలు చోరీకి గురవుతున్నాయని అతడు ఆరోపిస్తున్నాడు. ప్రతిరోజూ 10 నుంచి 20 కిలోల కూరగాయలు చోరీ అవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో దొంగలను కూడా పట్టుకున్నట్లు తెలిపాడు. దీంతో తన పొలం చుట్టూ నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రైతు చంద్రయ్య పేర్కొన్నాడు. కాగా తనకు మొత్తం 4 ఎకరాల పొలం ఉండగా.. అందులో రెండు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నట్లు రైతు తెలిపాడు. ప్రస్తుతం బీరకాయ, టమోటా వేశామని.. ప్రతిరోజూ 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నాడు.