ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిద్ర రావడం లేదని తెగ బాధపడిపోతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర రాకపోవడంతో టీవీ చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ కాలం గడిపే వారు ఎందరో ఉన్నారు. కానీ రాజస్థాన్లో ఓ వ్యక్తి కుంభకర్ణుడి తరహాలో ఏడాదికి 300 రోజులు నిద్రలోనే ఉంటాడట. నాగూర్ జిల్లా బద్వేల్లో నివసించే పూర్ఖారామ్ (40) అనే వ్యక్తి ఓ వింత వ్యాధితో సతమతం అవుతున్నాడు. అతడు ఒకసారి నిద్రలోకి జారుకుంటే మళ్లీ 25 రోజుల వరకు లేవడట. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడి డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా అతడికి హైపరో సొమ్నియా అనే అతినిద్ర వ్యాధి ఉందని గుర్తించారట.
పూర్ఖారామ్ పడుకుంటే రోజుల తరబడి అలాగే పడుకుని ఉంటాడు. ఆహారం కూడా నిద్రలోనే తినాల్సిన పరిస్థితి. ఒకవేళ అతను మేల్కోవాలి అని ఎంత అనుకున్నా శరీరం సహకరించని పరిస్థితి ఉంటుందట. దీంతో అతడు 25 రోజుల తర్వాత నిద్రలేస్తాడని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. గత 23 ఏళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందని వారు వాపోతున్నారు. ఈ వింత వ్యాధి తగ్గేందుకు వాళ్లు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం ఉండటం లేదని తెగ బాధపడిపోతున్నారు.