హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ను అనుకుని నిర్మించిన నెక్లెస్ రోడ్ పేరు ఇక కనుమరుగు కానుంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్‌రోడ్… పీవీ నరసింహారావు మార్గ్‌గా మారింది. ఇందుకు సంబంధించి నెక్లెస్ రోడ్ వెంట.. పీవీ నరసింహారావు మార్గ్ పేరుతో అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదే రోడ్డులో జ్ఞానభూమి పేరుతో పీవీ ఘాట్‌ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది.
5.5 కి.మీ పొడవైన నెక్లెస్ రోడ్‌ను 1998 మే 28న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత నెక్లెస్‌రోడ్ కాస్తా.. పీవీ నరసింహారావు మార్గ్‌గా మారుతోంది. నెక్లెస్ రోడ్ నగరంలో ప్రముఖ పర్యాటక స్థలంగా పేరు పొందింది. సాధారణ సమయాల్లో నిత్యం వేలాది మంది హుస్సేన్ సాగర్ చూసేందుకు వస్తూ.. ఈ రోడ్ వెంట వెళ్తుంటారు.