Breaking News

‘సినిమా బండి’ మూవీ రివ్యూ

2 0

రేటింగ్: 3.25/5

నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 14న విడుదలైన ‘సినిమా బండి’ చాలా సహజంగా ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమాటిక్ అనే ఆలోచనే రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో నగరాల్లో మొబైల్ ఉన్న ప్రతివ్యక్తి షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కానీ గ్రామాల్లోనూ సినిమా అభిరుచి ఉన్నవారు ఎందరో ఉన్నారు. వాళ్లు సినిమా తీయాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే అవగాహన లేకుండా వాళ్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘సినిమా బండి’ ద్వారా తెరపై చూపించారు.

కథ విషయానికి వస్తే.. వీరబాబు (వికాస్ వశిష్ట) ఓ ఆటోడ్రైవర్. ఒకరోజు ఆటో బ్యాక్ సీట్‌లో అతడికి ఓ పెద్ద కెమెరా దొరుకుతుంది. తొలుత దానిని అమ్మాలని భావించినా అనంతరం మనసు మార్చుకుని ఆ కెమెరాతో సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. తన ఫ్ర్రెండ్ గణపతి(వీడియో గ్రాఫర్)ని సంప్రదించి చిన్నచిన్న కథలు, పద్యాలు రాసే తాత సహాయంతో సినిమా ప్రారంభిస్తాడు. అయితే సినిమా ఎలా తీయాలో తెలియని వీరబాబుకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఇంతకీ దొరికిన కెమెరా ఎవరిది అన్న అంశాలతో మిగతా కథ తెరకెక్కింది.

ఓ చిన్నపాయింట్ పట్టుకుని ఈ సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించడం నిజంగా అద్భుతమే. మన ఎదుటే ఈ క్యారెక్టర్లు తిరుగుతున్నాయా అన్న రీతిలో వీరబాబు, గణపతి సహా మరికొన్ని క్యారెక్టర్‌ల జీవితాలను దగ్గర నుంచి చూస్తున్న భావన కలుగుతుంది. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్ వాళ్ల పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఏమాత్రం అల‌వాటు లేని మొహాల‌తో, అస‌లు సినిమాటిక్ డ్రామా, ఎక్స్‌ప్రెష‌న్ ఏమీ అవ‌స‌రం లేని స‌న్నివేశాల‌తో నింపేసిన సినిమా ఇది. కాబ‌ట్టి కావ‌ల్సినంత వినోదం అడుగ‌డుగునా క‌నిపిస్తూనే ఉంటుంది.

హీరో, హీరోయిన్ల‌ని వెదుకులాడే స‌న్నివేశం, హీరో, హీరోయిన్ ట్రైన్ ఎక్కి పారిపోవాల‌నుకున్న సీన్‌.. హీరోయిన్ మ‌ధ్య‌లో ఎవ‌రితోనో లేచిపోవ‌డం.. ఇలా ఒక‌దాని త‌ర‌వాత మ‌రో సీన్‌ మనల్ని న‌వ్విస్తూనే ఉంటాయి. క్లైమాక్స్‌లో అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని తాత చెప్పే డైలాగుకు నవ్వకుండా ఉండలేం. ఇలా చాలా విషయాల్లో ఈ సినిమా తనదైన మార్క్ తో ముందుకు సాగింది. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను, వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. షార్ట్ ఫిల్మ్‌లతో ప్రేక్షకులకు పరిచియమైన ప్రవీణ్ దర్శకుడిగా ఈ సినిమాతో అందరినీ అలరించాడనే చెప్పాలి. సత్యవోలు అందించిన సంగీతం కూడా బాగుంది. ఈ సినిమా ఎడిటింగ్‌లో ఎక్కడా ల్యాగ్ లేకపోవడం సూపర్బ్.

చివరగా సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోతుంది. అమాయకత్వ లక్షణాలు కలిగినవారు సినిమా తీయాలని పడే తాపత్రయం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. విభిన్న కథతో తెరకెక్కిన ఈ ‘సినిమా బండి’ టార్గెట్ ఆడియన్స్‌ను తప్పకుండా అలరిస్తుంది. థియేటర్లు లేని సమయంలో ఓటీటీల్లో చూసేందుకు ఈ సినిమా మంచి ఛాయిస్

A REVIEW WRITTEN BY NVLR