ఆదివారం టీవీలలో ప్రసారమయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ సాయంత్రం ప్రైమ్‌టైంలో వేసే సినిమాలకు మంచి టీఆర్పీ వస్తుంది. మాటీవీ, జెమినీ టీవీ రెగ్యులర్‌గా ఆదివారం సాయంత్రం 6 గంటలకు కొత్త లేదా క్రేజీ సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. అడపాదడపా జీ తెలుగు కూడా ఆదివారం సాయంత్రం కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది. అయితే ప్రముఖ ఛానల్ ఈటీవీ మాత్రం ఇటీవల 6 గంటల స్లాట్‌ను కేవలం మ్యూజిక్ లేదా పాటల షోలకు మాత్రమే ఉపయోగించేది. ఇప్పుడు రూట్ మార్చి సినిమాలను ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. సండే సిక్సర్ పేరుతో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు కొత్త సినిమా ప్రసారం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా సంక్రాంతి సూపర్ హిట్ మూవీ నారీ నారీ నడుమ మురారి, శ్రీ చిదంబరం గారు, మోగ్లీ సినిమాలను ప్రసారం చేయనుంది. వీటితో పాటు గతంలో ప్రసారం చేసిన రాజు వెడ్స్ రాంబాయి, హిట్-3, కోర్ట్, లిటిల్ హార్ట్స్, యశోద, కమిటీ కుర్రోళ్లు, క, సారంగపాణి జాతకం సినిమాలను కూడా టెలికాస్ట్ చేయనున్నట్లు ఈటీవీ వెల్లడించింది.
