పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా అరంగేట్రం చేసి ఆ తర్వాత బలగం మూవీతో హీరోగా సూపర్ డూపర్ హిట్ అందుకున్న విలక్షణ నటుడు ప్రియదర్శి. అయితే కొంతకాలంగా అతడికి హిట్ రావడం లేదు. డార్లింగ్, ప్రేమంటే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. తాజాగా ప్రియదర్శి నటించిన ‘సుయోధన’ అనే మూవీ రిలీజైంది. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీరామనవమి సందర్భంగా విడుదలైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ (ప్రియదర్శి) ఫోలీ ఆర్టిస్ట్. అంటే సౌండ్ డిజైనర్ అన్నమాట. సినిమాల్లో శబ్దాలు క్రియేట్ చేస్తాడు. అయితే అతడికి చిన్నప్పటి నుంచి వింత సమస్య ఉంటుంది. తనకి మాత్రమే ఓ వాయిస్ వినిపిస్తూ దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందు కనిపిస్తుంది. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) ఒక రాజకీయ నేత, నాటక కళాకారుడు. దుర్యోధనుడి పాత్ర అంటే ప్రకాష్‌కు చాలా ఇష్టం. కానీ తన కుమారుడికి ఇబ్బంది అవుతుందని నాటకాలు మానేస్తాడు. రాజకీయాలపైనే ఫోకస్ పెడతాడు. ఒకవైపు కుమారుడు ఫోలీ ఆర్టిస్టుగా.. తండ్రి రాజకీయ నేతగా ఎవరి జీవితాలు వాళ్లు కొనసాగిస్తుంటారు. ఈ దశలో హీరోయిన్ సమిత (ద్రిషికా చందర్) పరిచయం అవుతుంది. ఆమె తీసిన డెమో ఫిలిం కోసం వరుణ్ సాయం చేస్తాడు. కట్ చేస్తే రాజకీయాల్లో ఎదుగుతున్న వరుణ్ తండ్రిపై హత్యాయత్నం జరుగుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఒకానొక దశలో వరుణ్‌కు తన తండ్రిలోనే దుర్యోధనుడు కనిపిస్తాడు. అంతలోనే తండ్రి హత్యకు గురవుతాడు. అసలు ప్రకాష్‌ను ఎవరు చంపారు? వరుణ్‌కు ఉన్న వింత సమస్య వల్ల ఎలాంటి నిజాలు వెలుగు చూశాయన్నది మిగతా స్టోరీ.
దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి ఎంచుకున్న ‘ఫోలే ఆర్టిస్ట్’ అనే పాయింట్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో శబ్దాలను ఎలా రికార్డ్ చేస్తారో చూపిస్తూనే, కథలో సస్పెన్స్‌ను చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రియదర్శి తన కెరీర్లో మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భయం, ఆందోళన కలిగించే పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సాయి కుమార్ వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి గంభీర వాయిస్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రేమ వరుణ్ తల్లి పాత్రలో ఆకట్టుకోగా.. హీరోయిన్ ద్రిషిక చందర్ తన పరిధి మేరకు బాగా నటించింది. సత్యదేవ్, బిత్తిరి సత్తి క్యామియోలు సినిమాకు సరిపోయాయి. మ్యాడ్ మూవీ ఫేం విష్ణు ఓయ్ కామెడీ ఫర్వాలేదు. ప్రియదర్శి నటన, డైలాగ్స్, బీజీఎం, తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా సెకండాఫ్ ఎంగేజింగ్‌గా ఉన్నా ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు.
రేటింగ్: 3.25/5
