Breaking News

దురంధర్-2 దెబ్బ.. టాలీవుడ్ అబ్బ..!!

1 0

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్-2 సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపుగా 1400 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డును కైవసం చేసుకుంది. దీంతో ఇప్పుడు మార్చి 19న విడుదలకు సిద్ధమైన ‘దురంధర్ ది రివెంజ్’ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోయిందనే రివ్యూలు వచ్చాయి. రణ్‌వీర్ సింగ్‌ను ఇలాంటి యాక్షన్ అవతార్‌లో ఎప్పుడూ చూడలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాహుబలితో పాటు ఇతర సినిమాల రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుందని జోస్యం చెప్తున్నారు. రికార్డుల సంగతి పక్కన పెడితే కొత్త సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే ఓపెన్ చేయడం ఎంత కీలకమో ‘దురంధర్-2’ సినిమా టాలీవుడ్‌కు ఓ గుణపాఠం నేర్పుతోంది. ఇటీవల టాలీవుడ్‌లో పుష్ప-2, దేవర, హరిహరవీరమల్లు, ఓజీ, రాజాసాబ్ వంటి సినిమాలకు బుకింగ్స్ కేవలం 1 లేదా 2 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆయా సినిమాలకు మైనస్ అయ్యింది. సాధారణంగా మన నిర్మాతలు అదనపు టికెట్ రేట్లు, జీవోలకు ఎదురు చూస్తున్నారు కాబట్టి బుకింగ్స్ ఆలస్యమవుతున్నాయి. దీంతో చాలా సినిమాలకు విడుదలకు ముందే రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది.

అయితే ‘దురంధర్-2’ యూనిట్ రిలీజ్‌కు 12 రోజుల ముందే ట్రైలర్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. అదనపు రేట్లు లేకుండా నార్మల్ టికెట్ ధరలతోనే ప్రీమియర్స్ కూడా ఏర్పాటు చేయడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల సినిమాపై హైప్ పెరగడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూడాలన్న క్రేజ్ ఎంతలా ఉందంటే.. సినీ అభిమానులు రూ.3100 పెట్టి కూడా టికెట్లు కొంటున్నారు. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం ‘ధురంధర్ ది రివెంజ్’ సినిమా పెయిడ్ ప్రివ్యూ అడ్వాన్స్ టికెట్ల అమ్మకాల ద్వారా ఇప్పటికే దాదాపు రూ.23 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. సినిమా రిలీజ్‌కు ఇంకా టైం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ బాలీవుడ్ సినిమాకు ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో కూడా దురంధర్-2 హవా కనిపిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో కూడా బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నగరంలోని మిగతా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పుడే కలెక్షన్స్ ఇలా ఉంటే విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉండే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ షేక్ అవుతోంది. మరి ఈ సినిమాను చూసైనా మన అగ్రసినిమాల నిర్మాతలు వారం ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేస్తారా లేదా కంటెంట్‌పై నమ్మకం ఉంచకుండా టిక్కెట్ రేట్ల పెంపుపైనే ఆధారపడి ఒకరోజు ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అన్నది వేచిచూడాలి. అన్నట్లు దురంధర్-2 విడుదలైన రోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా భారీ ఎత్తున విడుదలవుతోంది. మరి ఈ సినిమా బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. మరి ఓపెన్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని ట్రేడ్ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.