గత ఏడాది జరిగిన మహా కుంభమేళా అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాగ్రాజ్లో పూసలు అమ్ముకుంటూ అమాయకపు చిరునవ్వుతో 18 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారిన యువతి మోనాలిసా భోంస్లే మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా ప్రభావంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఈ యువతి తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. సినిమాలతో బిజీగా అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో పూసల పిల్ల రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య తిరువనంతపురంలో పోలీసుల రక్షణ మధ్య ఈ వివాహం జరిగింది. ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని అనంతరం ఆలయంలో పెళ్లి చేసుకుంది.
అయితే మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. లవ్ జిహాద్లో భాగంగానే మోనాలిసా వివాహం జరిగిందని ఆరోపించాడు. ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని విమర్శలు చేశాడు. మోనాలిసాకు తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని చెప్పాడు. ఆమె జీవితాన్ని మార్చేందుకు తాను ఎంతో కష్టపడ్డానని.. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని తెలిపాడు. సౌత్ ఇండస్ట్రీలో మోనాలిసాకు సినిమాల ఒప్పందాలు కూడా అతడే చేయించాడని వెల్లడించాడు. మరోవైపు తమది లవ్ జిహాద్ వివాహం కాదని మోనాలిసా స్పష్టం చేసింది. తనను ఇస్లాం మతంలోకి మారాలని ఫర్మాన్ అడగలేదని.. తాము హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నామని వివరణ ఇచ్చింది.
