టీ20 క్రికెట్లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. 2024 ప్రపంచకప్ తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోని భారత్ తాజాగా 2026 ప్రపంచకప్‌ను కూడా ముద్దాడింది. దీంతో టీమిండియా ఖాతాలో 8వ ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే ప్రపంచకప్, 2001 ఛాంపియన్స్ ట్రోఫీ (శ్రీలంకతో సంయుక్తంగా), 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ వంటి టైటిళ్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఈ జాబితాలో 10 ఐసీసీ టైటిళ్లతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు ఏ జట్టు గెలవలేదు. ఈ రికార్డును భారత్ మాత్రమే సాధించింది. మరోవైపు సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగానూ భారత్ రికార్డును కైవసం చేసుకుంది. అంతేకాకుండా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండు సార్లు మాత్రమే పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచాయి.
2026 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ, రోహిత్, కోహ్లీ లాంటి స్టార్లు లేకపోయినా కేవలం కుర్రాళ్లతోనే భారత్ విశ్వవిజేతగా నిలవడం గమనించాల్సిన విషయం. టోర్నీ ఆసాంతం సాధికారికంగా ఒక్క విజయం సాధించకపోయినా ఫైనల్లో తనదైన ఆటతీరుతో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఏకపక్ష విజయాన్ని సాధించి ప్రపంచకప్ టైటిల్ గెలిచింది.
