సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి భారత్ విజేతగా నిలిచింది. అయితే పాకిస్థాన్‌తో శత్రు సంబంధాల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్ వ్యక్తి నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ఇష్టపడలేదు. దీంతో నఖ్వీ ఆ ట్రోఫీని, మెడల్స్‌ను మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు ఇవ్వకుండా, తనతో పాటు తీసుకెళ్లి ఏసీసీ కార్యాలయంలో భద్రపరిచాడు. నాటి నుంచి ఆ ట్రోఫీని ఇవ్వడానికి షరతులు విధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్రోఫీ, మెడల్స్ ఏసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నాయి. అయితే తాజాగా ఆసియా కప్ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అబుదాబిలోని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అది నఖ్వీ ఆధీనంలో అబుదాబిలో గుర్తుతెలియని ప్రదేశంలో ఉందని తెలిసింది. బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇటీవల ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా అక్కడ ట్రోఫీ లేదని సమాచారం అందింది. దీంతో కావాలనే నఖ్వీ ట్రోఫీని రహస్య ప్రదేశానికి తరలించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
