Breaking News

యువకుడి ప్రాణం తీసిన కుక్క గోరు

1 0

చాలా మంది పెంపుడు కుక్కలను ఇంట్లో ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే అసలు తట్టుకోలేరు. ఈరోజుల్లో మనుషుల కంటే పెంపుడు జంతువులకే కొంతమంది ప్రాధాన్యం ఇవ్వడం ఇటీవల కనిపిస్తున్న విచిత్రాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో పెంపుడు కుక్క వల్ల ఓ యువకుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. అందంగా ఉందని పెంచుకున్న కుక్కపిల్ల గోరు గీరుకోవడం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన ముత్తెబోయిన సందీప్ (25) రెండు నెలల క్రితం వీధిలో కనిపించిన ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఆ కుక్కపిల్ల సందీప్ తండ్రి పున్నయ్యను కరిచింది. దీంతో సందీప్ తన తండ్రిని పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అదే సమయంలో సందీప్ కాలికి కూడా దాని గోరు బలంగా గీసుకుంది. తన కాలికి తగిలిన గాయాన్ని మాత్రం తేలికగా తీసుకున్నాడు. ఎలాంటి వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న అతడికి రెండు నెలల తర్వాత రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైంది. కొన్ని రోజుల్లోనే వ్యాధి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో సోమవారం రాత్రి సందీప్ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లే తమ కుమారుడి ప్రాణాలు తీయడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.