Breaking News

వైఎస్ జగన్‌లో మార్పు రాదా?

1 0

రాజకీయ నేతలు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడం సాధారణ విషయమే. అయితే తాము ఏ పరిస్థితుల్లో ఉన్నామో రాజకీయ నేతలు బేరీజు వేసుకోవడం తప్పనిసరి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే వైసీపీ అధినేత జగన్‌‌లో నానాటికీ ఫస్ట్రేషన్ ఎక్కువ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా ఆ పరిస్థితికి కారణాలను బేరీజు వేసుకోకుండా ఈవీఎంలపై నెపం నెట్టి వైసీపీ నేతలు పబ్బం గడుపుకున్నారు. నిజానికి 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేశారు. కానీ టీడీపీ వాస్తవ పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకుని పార్టీని బలోపేతం చేశారు. అయితే జగన్‌ మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తూ నిత్యం అభాసుపాలవుతున్నారు. జనరల్ ఎలక్షన్స్‌లో ఈవీఎంలపై ఆరోపణలు చేసిన జగన్.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ ఎన్నికలపైనా ఆరోపణలు చేయడం కొసమెరుపు. దొంగ ఓట్లు వేసుకున్నారని చంద్రబాబుపై ఓ రేంజ్‌లో జగన్ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేసి అందరితో ఛీ అనిపించుకుంటున్నారు. చంద్రబాబు జీవితానికి ఇవే ఆఖరి ఎన్నికలు అని.. ఆయన ఈ వయసులో కృష్ణా రామా అనుకుంటూ కాలం వెళ్లదీయాలని సలహా ఇవ్వడంపై రాజకీయ పండితులు మండిపడుతున్నారు. మరి చంద్రబాబు కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రధాని మోదీకి కూడా జగన్ ఇలాంటి సలహానే ఇస్తారా అంటే అనుమానాస్పదం అనే చెప్పాలి. మోదీని ఏమనలేక రాహుల్ గాంధీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం ఆలోచించాల్సిన విషయం. ఓటమి ఎదురైనప్పుడు ఫస్ట్రేషన్‌కు గురికావడం తరచూ కనిపించేదే అయినా చౌకబారు ఆరోపణలు చేసి జగన్ పరువు పోగొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో భవిష్యత్ ఉన్న జగన్‌లో మార్పు రాకుంటే 2029లో సైతం వైసీపీకి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.