టాలీవుడ్లో ఇప్పటి వరకు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేశారు. రాజమౌళి సినిమాతో మహేష్ కూడా ఈ క్లబ్లో చేరిపోయాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. మూడేళ్ల విరామం తర్వాత సోలో హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ వారమే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ సుమారు ఐదేళ్లకు పైగా జరిగింది. దర్శకుడు కూడా మారిపోయాడు. మరోవైపు 2018 తర్వాత రీమేక్ కాకుండా పవన్ చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంచనాలకు మించే జరిగిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కుల సంగతి పక్కన పెడితే థియేట్రికల్ హక్కుల కోసం చాలా మందే పోటీ పడ్డారు. నైజాం హక్కులను మైత్రీ మూవీస్ సొంతం చేసుకుంది. నైజాంలో ఈ మూవీ రూ.37 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. సీడెడ్‌లో రూ.16.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.9.5 కోట్లు, కృష్ణాలో రూ.7.6 కోట్లు, నెల్లూరులో రూ.4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. తెలుగు రాష్ట్రాలలో రూ.103.5 కోట్ల బిజినెస్ జరగ్గా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, హిందీ డబ్బింగ్ రూ.12.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో రూ.10 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. మొత్తంగా చూసుకుంటే రూ.126 కోట్లకు పవన్ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేశాయి. హరిహరవీరమల్లు బ్రేక్ ఈవెన్‌కు చేరాలంటే రూ.127 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే పవన్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల షేర్ సినిమాగా ఈ మూవీ రికార్డులు సృష్టించనుంది.
