Breaking News

సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం

1 0

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. తాజాగా పుణె టెస్టులోనూ ఓటమి చెందింది. 359 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. 60.2 ఓవర్లలో 245 పరుగులకు రోహిత్ సేన ఆలౌటైంది. దీంతో 113 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చెందింది. ఓపెనర్ జైస్వాల్ (77) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జడేజా (42) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ రోహిత్ (8), విరాట్ కోహ్లీ (17) మరోసారి విఫలమయ్యారు. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులకే పెవిలియన్ చేరగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 6 వికెట్లు, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

టెస్టుల్లో 12 ఏళ్లుగా సొంతగడ్డపై టీమిండియాకు తిరుగులేదు. వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. కానీ తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కోల్పోయింది. గతంలో 2012లో ఇంగ్లండ్ చేతిలో స్వదేశంలో ఓడిన భారత్.. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. విచిత్రం ఏంటంటే.. ఇటీవల శ్రీలంకలో ఆ జట్టు చేతిలో ఘోరంగా ఓడిన కివీస్.. రోహిత్ సేనపై మాత్రం అద్భుతంగా పోరాడి ఘన విజయం సాధించింది. అయితే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల టేబుల్‌లో టీమిండియా ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. న్యూజిలాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడినా రోహిత్ సేన మాత్రం టాప్‌లోనే కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 62.5 పాయింట్ల శాతం ఉండగా.. భారత్‌కు 62.82 పాయింట్ల శాతం ఉంది. టీమిండియా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న 5 టెస్టుల సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.