ఇటీవల వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియాకు జింబాబ్వే గడ్డపై షాక్ తగిలింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ 20లో యువ భారత్‌కు పసికూన జింబాబ్వే తనదైన రీతిలో పంచ్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేవలం 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి ఖాయమనుకున్న జింబాబ్వే..బౌలింగ్‌లో మాత్రం భారత యువ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు జింబాబ్వే బౌలర్లకు తలవంచారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చివరి ఓవర్ వరకూ ఒంటరి పోరాటం చేసినా భారత్‌ను గెలిపించలేకపోయాడు. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా లక్ష్యానికి 13 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.