Breaking News

Tollywood: టాలీవుడ్‌లో పాగా వేసిన తమిళ సంగీత దర్శకులు

1 0

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వెలిగిపోతోంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అందుకుంది. దీంతో బాలీవుడ్ కూడా టాలీవుడ్ భజన చేస్తోంది. ఇటీవల సల్మాన్ కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు కీలక పాత్ర కట్టబెట్టారు. త్వరలో రేస్-3 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పొరుగింటి కూర రుచి అన్న తరహాలో టాలీవుడ్ మాత్రం ఇతర చిత్ర పరిశ్రమలపై అతిగా ఆధారపడుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా సినిమాలకు తమిళ సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. నిజానికి తెలుగులో దేవిశ్రీప్రసాద్, కీరవాణి, తమన్ లాంటి అగ్ర సంగీత దర్శకులు ఉన్నారు. వీళ్లు అందుబాటులో లేకపోతే మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్, వివేక్ సాగర్, మహతి స్వరసాగర్, కాలభైరవ వంటి సంగీత దర్శకులు కూడా మంచి ఛాయిస్. కానీ వీళ్లను పక్కనపెట్టి తమిళ సంగీత దర్శకులు అనిరుధ్, ఏఆర్ రెహ్మాన్, యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాష్ కుమార్, హారిస్ జైరాజ్ వంటి వారిని మన తెలుగు హీరోలు, దర్శకులు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో దాదాపు 10కి పైగా సినిమాలకు తమిళ సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 12వ సినిమాలకు అనిరుధ్… రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితిన్-వెంకీ కుడుముల మూవీ, పంజా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి సినిమాలకు జీవీ ప్రకాష్ కుమార్.. రామ్‌చరణ్ గేమ్ చేంజర్, నాగచైతన్య-చందూ మొండేటి సినిమాలకు ఏఆర్ రెహ్మాన్, నితిన్ 32వ సినిమా, నాగశౌర్య 24వ సినిమాలకు హారిస్ జైరాజ్, విశ్వక్ సేన్ 11వ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.