ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం టైటిల్ ఊరిస్తూనే ఉసూరుమనిపిస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆర్సీబీ జట్టులో ఎందరో స్టార్ ఆటగాళ్లు ఉన్నా టైటిల్ మాత్రం దక్కడం లేదు. ఈ సాలా కప్ నమదే అన్న నినాదంతో ఆర్సీబీ అభిమానులు ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ సీజన్‌లోనూ ఆ జట్టు పరిస్థితి తీసికట్టుగానే ఉంది. కేజీఎఫ్ (కోహ్లీ, మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటం లేదు. టాపార్డర్ రాణిస్తే సరి.. లేకపోతే సరేసరి అన్న తరహాలో ఆర్సీబీ ప్రదర్శన ఉంటోంది.
అయితే గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ అదిరిపోయే విజయం సాధించింది. దీంతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(మే 18), గుజరాత్ టైటాన్స్(మే21)తో కోహ్లీ టీమ్ తలపడనుంది. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు వెళ్లినా ఎంతవరకు ఫైనల్ చేరుతుందనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. మిడిలార్డర్ వైఫల్యం, బౌలింగ్‌లో నామమాత్రపు ప్రదర్శన ఆర్సీబీ ప్రయాణాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.