Breaking News

REVIEW: ఎన్టీఆర్, రామ్‌చరణ్ ‘RRR’ మూవీ రివ్యూ

4 1

RRR MOVIE REVIEW AND RATING

ట్యాగ్‌లైన్: రాజమౌళి మార్క్ ఎమోషన్ మిస్

రేటింగ్: 3/5

మాములుగానే స్టార్ హీరోల సినిమాలంటే అంచనాలు హైలో ఉంటాయి. అందులోనూ ఇద్దరు యువ స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఆ అంచనాలు ఎక్కడి వరకు వెళ్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను ప్రపంచ స్థాయి దర్శకుడు తెరకెక్కిస్తే ఇంకా ఆ అంచనాల స్థాయి గురించి చెప్పడానికి మాటలు చాలవు. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఊహకు అందని అంచనాలు ఉన్నాయి. కానీ రాజమౌళి సినిమాల్లో ఉండే ఎమోషన్ ఈ సినిమాలో కనిపించలేదు. ఎంతో వెలితిగా సినిమా నుంచి బయటకు వస్తాం.

ఇక కథ విషయానికి వస్తే.. కథంతా ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు జాతి పిల్లను బ్రిటీష్ వాళ్లు ఎత్తుకుపోతారు. వాళ్ల అమ్మను కూడా చంపేస్తారు. దీంతో గోండు జాతి నాయకుడు కొమరం భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. గోండు పిల్ల కోసం ఢిల్లీ వెళ్తాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి ఇన్‌స్పెక్టర్ కావాలని అల్లూరి సీతారామరాజు (రామ్‌చరణ్) పరితపిస్తుంటాడు. అలా బ్రిటీష్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఢిల్లీలో అనుకోని విధంగా రామ్, భీమ్ కలుస్తారు. వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే వారి ఆశయాలు ఒకరికొకరి తెలియవు. తెలిసే సమయానికి వైరం ఏర్పడుతుంది. చివరకు వీళ్లిద్దరి స్నేహం ఏ తీరానికి చేరింది.. బ్రిటీష్ వాళ్ల నుంచి ప్రజలను ఎలా కాపాడారు అన్నది మిగతా స్టోరీ.

రాజమౌళి సినిమాల్లో హీరోల ఇంట్రో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోల ఎంట్రీ ఉంటుంది.. కాకపోతే సినిమా ప్రారంభమైన చాలా సేపటికి హీరోలు ఎంట్రీ అవుతారు. అయితే ఈసారి తెలిసిన కథకే రాజమౌళి పూత పూశాడు. సాధారణంగా ఆయన సినిమాల్లో హీరో, విలన్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ బలంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడంతో కథ, కథనంపై ఆసక్తి వేరే విషయాలపైకి మళ్లేలా చేశాడు. దీంతో జక్కన్న మార్క్ ఎమోషన్ మిస్ అయ్యింది. తెరపై మనకు రామ్‌చరణ్, ఎన్టీఆర్ కనిపించరు. వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఫర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇద్దరిలో రామ్‌చరణ్‌కు కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ దక్కినా ఎన్టీఆర్ అభిమానులకు అది కనిపించకుండా జక్కన్న మాయ చేస్తాడు. ఆలియా భట్ పాత్ర చిన్నదే. రామ్‌చరణ్ గురువు పాత్రలో అజయ్ దేవగణ్ నటించాడు. బ్రిటీష్ రాణిగా ఒవిలీయా మోరిస్ ఆకట్టుకుంది. సముద్రఖని పాత్రకు ప్రాధాన్యం లేదు. శ్రియ పాత్ర నిడివి మ‌రీ చిన్నది. రాహుల్ రామకృష్ణ భీమ్ స్నేహితుడిగా కనిపిస్తాడు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే రాజమౌళి తర్వాత ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం పోసింది. కె.కె.సెంథిల్ కుమార్ ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపించింది. కీరవాణి సంగీతం గొప్పతనం పాటల్లో కంటే బీజీఎంలో మనకు కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ బాగా కుదిరాయి.

ఈ సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ వరకు బాగానే సాగిపోయింది. అయితే వచ్చిన సమస్యల్లా సెకండాఫ్. సెకండాఫ్‌ చాలా చప్పగా సాగుతుంది. క్లైమాక్స్ వచ్చేవరకూ ఏదో అలా వెళుతూ ఉన్నట్టు ఉంటుంది తప్పితే హై మూమెంట్ అనేది ఉండదు. మనకు తెలిసిన కథకే అల్లూరి, భీమ్ వంటి పూత పూయడంతో చివరకు జక్కన్న ఏం చేస్తాడో అని ఎదురుచూస్తాం అంతే. ఎత్తర జెండా అనే పాటను టైటిల్ కార్డుల్లో వాడుకున్నారు. కానీ అప్పటికే సినిమాపై అంచనాలు నేలను తాకుతాయి. ఏదో అనుకుంటే మరేదో చూశాం అన్న ఫీలింగ్ కలుగుతుంది.

రాజమౌళి గత సినిమాల్లో.. చివరకు బాహుబలి సినిమాలో కూడా ఎమోషన్ మనల్ని టచ్ చేస్తుంది. అందుకే రాజమౌళి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను జక్కన్న అంతే మనసు పెట్టి చేశాడు. కానీ కథే మైనస్ పాయింట్. కథలో బలమైన విలన్ లేనప్పుడు హీరోయిజం మాత్రం ఎలా ఎలివేట్ అవుతుంది. మెయిన్ పాయింట్ విషయంలో రాజమౌళి ఆలోచన అర్థం కాకుండా ఉంది. ఊహాజనిత కథల్లో కూడా బలమైన విలన్ ఉండటం రాజమౌళి ప్రత్యేకత. ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య బంధంతో అన్ని రకాల ఎమోషన్‌లు బయటపెడతామని జక్కన్న భావించడంతో అసలు సిసలు ఎమోషన్ చూసే భాగ్యం అభిమానులకు దక్కలేదు. జస్ట్ అంతే.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: భ్రమరాంబ (కూకట్‌పల్లి)