Breaking News

అల్లు అర్జున్ ‘పుష్ప-పార్ట్ 1’ మూవీ రివ్యూ

3 0

ALLU ARJUN PUSHPA THE RISE MOVIE REVIEW AND RATING

రేటింగ్: 2.5/5

భారీ అంచనాల నడుమ అల్లు అర్జున్ ‘పుష్ప-దిరైజ్’ విడుదలైంది. అల వైకుంఠపురములో లాంటి క్లాస్ సినిమా తర్వాత వచ్చిన పక్కా మాస్ మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అందులోనూ రెండు భాగాలుగా తెరకెక్కడం, పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం వంటి విషయాలు ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. మరి పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ అలరించాడో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే.. పుష్ప(అల్లు అర్జున్)కు ఇద్దరు అన్నలు ఉంటారు. వీరు ఒకే తండ్రికి పుట్టినా తల్లులు మాత్రం వేరు. దీంతో చిన్నప్పుడే ఇంటిపేరు కోల్పోయిన పుష్ప చివరకు రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదిగి కొండారెడ్డి (అజయ్‌ఘోష్)కు పార్ట్‌నర్‌గా మారతాడు. ఆ తర్వాత ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను (సునీల్)ను ఎదిరించి.. పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్‌గా రూపాంతరం చెందుతాడు. ఈ మధ్యలో అతడు శ్రీవల్లి (రష్మిక)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పుష్ప ఎలా గెలుచుకున్నాడు.. ఇంతకీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాను బన్నీ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. ఎర్రచందనం స్మగ్లర్‌గా అతడి నటన, మేకప్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మునుపెన్నడూ చూడని విధంగా మాస్ క్యారెక్టర్‌లో బన్నీ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి మనకు పుష్పరాజ్ మాత్రమే కనిపిస్తాడు కానీ బన్నీ కనిపించడు. హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్‌గా రష్మిక కూడా బాగానే నటించింది. నా సామీ సాంగ్‌లో అయితే రష్మిక తన విశ్వరూపం చూపించింది. ఈ సినిమా రష్మిక కెరీర్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుంది. హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ అయితే ఈ సినిమాను మరో లెవల్లో నిలబెట్టింది. బన్నీతో మాస్ స్టెప్స్ వేస్తూ థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించింది. ఇక సునీల్, అనసూయ తమ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్‌లను చేశారు. ఫాహాద్ ఫాజిల్ పాత్ర ఈ సినిమాలో కాసేపే కనిపించింది. సెకండ్ పార్ట్‌లో అతడిది కీలక పాత్రగా ఉంటుంది కాబోలు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు సుకుమార్ ఈ మూవీలో కేవలం యాక్షన్ మీదే దృష్టి పెట్టాడు. కాస్త ఫన్ మీద కూడా దృష్టి సారించి ఉంటే ఈ సినిమా స్థాయి పెరిగేది. పాత్రల మధ్య ఎమోషన్స్ కూడా సరిగ్గా పండలేదు. కథ, కథనాలు పాతవే కావడం, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలలో బలం లేకపోవడంతో దీంతో ఏదో చూస్తున్నాం అన్నట్లుగా ఉంది. సినిమా కాస్త ఊరట కలిగించేది దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. ఇప్పటికే అన్ని పాటలు జనంలోకి వెళ్లడంతో యాక్షన్ సన్నివేశాల మధ్య ఈ సాంగ్స్ రిలీఫ్‌ అనిపించాయి. సమంత సాంగ్ బిగ్ ఎస్సెట్‌గా నిలిచింది. కుబ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మరిన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసుంటే బాగుండేది.

సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాకు, పుష్ప సినిమాకు తేడా ఏంటంటే.. ఆ సినిమాలో ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. పుష్పలో ఆ అంశమే నిరాశపరిచింది. అందులోనూ కథనం చాలా నెమ్మదిగా సాగడంతో బోర్‌ ఫీలింగ్ వస్తుంది. సినిమా మూడు గంటలు ఉండటం కూడా మైనస్ అనే చెప్పాలి. క్లైమాక్స్ అయితే చాలా బలహీనంగా ఉంది. బహూశా సెకండ్ పార్టు మీదకు కథను మళ్లించడానికి సుకుమార్ క్లైమాక్స్ ఇలా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. బన్నీ మాత్రం మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో ప్రతి సన్నివేశం రిచ్‌గా కనిపించింది. మారేడుమిల్లి బ్రాక్ డ్రాప్‌లో తీసిన సన్నివేశాలు ఫ్రెష్ లుక్‌ను అందిస్తాయి.

చివరగా… పుష్ప ది రైజ్ బన్నీ అభిమానులను మాత్రమే సంతృప్తి పరుస్తుంది. ముగింపు సన్నివేశాలు బలంగా లేకపోవడంతో థియేటర్‌కు బయటకు వచ్చే ప్రేక్షకుడికి అంత కిక్ అనిపించదు. ఓవరాల్‌గా యావరేజ్ సినిమా చూసిన ఫీలింగే వస్తుంది. అల్లు అర్జున్, రష్మికల నటన, సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సన్నివేశాలు, దేవిశ్రీ సంగీతం కోసం ఈ సినిమాను ఒకసారి లుక్ వేయవచ్చు.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)