రాను రాను మనుషులు మారిపోతున్నారు. మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. నిర్లక్ష్యం పెరుగుతోంది. అయితే ప్రముఖ వేదపండితుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మాటలు వింటే ఔరా అనిపిస్తోంది. ప్రతి మనిషి దేశాభిమానం కంటే.. దేహాభిమానం పెరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి దేహం మీద వారికి అభిమానం ఉంటుంది కాబట్టే సెల్ఫీల పట్ల మోజు పెరిగిపోతుందన్నారు. అయితే దేశం పట్ల అభిమానం తగ్గిపోవడం దురదృష్టకరమన్నారు. మనిషి ప్రాణం పోతుందన్నా అతడిని కాపాడాల్సింది పోయి సెల్ఫీలు తీసుకుంటున్నారని.. వాళ్ల ప్రాణం పోతుందని తెలిసినా సెల్ఫీలు తీసుకుంటున్నారని గరికపాటి చెప్పారు. అందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘భారతమాతకు మహాహారతి‘ అనే ప్రోగ్రామ్ తలపెట్టారని.. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు హాజరు కావడం అభినందనీయమన్నారు.
ఇప్పుడు ప్రతి ఊరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా.. లేకున్నా మూడు, నాలుగు బ్యూటీ క్లినిక్‌లు మాత్రం ఉంటున్నాయని.. దీనిని బట్టి మనిషికి దేహాభిమానం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాస్త చర్మంపై ముడతలు వచ్చినా.. తలపై తెల్ల వెంట్రుకలు వచ్చినా బ్యూటీ క్లినిక్‌లలో వాలిపోతున్నారని.. కానీ దేశం ముసలిది అయిపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. దేహాన్ని గురించి కాకుండా దేశాన్ని గురించి ఆలోచిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. కాగా దేశభక్తి గురించి గరికపాటి చెప్పిన మాటలు విన్న పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టి ఆయన్ను అభినందించారు.