Breaking News

బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

3 0

BALAKRISHNA AKHANDA MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3/5

బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’. గతంలో సింహా, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. పూర్తిగా మాస్ ప్రేక్షకుల కోసమే తీసిన ఈ మూవీ వారికి కన్నులవిందు అనే చెప్పాలి. బాలయ్యను బోయపాటి మాత్రమే ఎందుకు అంత బాగా చూపిస్తున్నాడో అఖండ చూస్తే మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అఖండ అందిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక కథలోకి వెళ్తే… మురళీకృష్ణ (బాలయ్య) అనంతపురంలో ఉంటూ ఫ్యాక్షనిజం బాట పట్టిన ఎంతోమందిని మారుస్తాడు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన శరణ్య (ప్రగ్యాజైశ్వాల్) మురళీకృష్ణ మంచితనాన్ని చూసి ప్రేమలో పడుతుంది. ఆ ప్రాంతంలో వరదరాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాను నడిపిస్తుంటాడు. దీంతో వరదరాజులుకి మురళీకృష్ణ అడ్డుగా నిలబడతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో మురళీకృష్ణ అరెస్ట్ అవుతాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అఘోరాగా అఖండ (బాలయ్య) ఎంటర్ అవుతాడు. మరి అఖండ ఎవరు? అఖండకు మురళీకృష్ణకు సంబంధమేంటి? వీరిద్దరూ వరదరాజులును ఎలా ఎదుర్కొన్నారు అన్నదే మిగతా కథ.

బాలయ్య-బోయపాటి సినిమా అనగానే ఎలాంటి అంశాలు ఉంటాయో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అభిమానుల అంచనాలను ఒక్కసారి కూడా బోయపాటి కిందకు దించడు. బాలయ్య కూడా 100 శాతం సూపర్బ్ నటనను కనపరిచాడు. రౌద్రం క్యారెక్టర్‌లో బాలయ్య నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి. అయితే ప్రగ్యా జైశ్వాల్‌తో బాలయ్య రొమాన్స్ సీన్లు అంత పండలేదు. అయితే వీరి జోడీ చూసేందుకు చాలా బాగుంది. అఖండ పాత్రలో బాల‌కృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా న‌మ్మేలా ఉంటాయి. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. దేవుడికి, విజ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం గురించి బాలయ్య చెప్పే డైలాగ్ అదుర్స్ అనే చెప్పాలి.

ఈ మూవీలో బాలయ్య వన్ మేన్ షో చేశాడు. రెండు పాత్రలలో బాలయ్య చాలా బాగా నటించాడు. ముఖ్యంగా బాలయ్య అఘోర గెటప్ లో ఎంటర్ అయ్యాక సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళుతుంది. ఎమోషనల్ సన్నివేశాలలో బాలయ్య హావభావాలు హత్తుకునేలా కనిపిస్తాయి. క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్‌తోపాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌కంగా ఉంటాయి. ఇక విలన్‌గా శ్రీకాంత్ విజృంభించాడు. లెజెండ్‌లో జగపతిబాబులా అఖండలో శ్రీకాంత్ తన పాత్రలో అద్భుతంగా రాణించాడు. వరదరాజులు పాత్రలో చాలా క్రూరంగా నటించాడు. జగ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ తమ పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. శ‌క్తిస్వరూపానంద స్వామిగా క‌నిపించిన విలన్ కూడా త‌న‌దైన ప్రభావం చూపించాడు.

ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్. ఇటీవల కాలంలో తమన్ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో అఖండ మరోసారి తమన్ పనితనాన్ని చాటిచెప్తుంది. త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం ఎలాంటిదో అర్థమ‌వుతుంది. తమన్ పాటల్లో జైబాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా చాలా బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు, రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. ద్వారక క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అఖండ ప్రభావం రెండు వారాల వరకు ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక ఎందుకు ప్రత్యేక‌మో ఈ సినిమా మ‌రోసారి స్పష్టం చేస్తుంది. సింహా, లెజెండ్ సినిమాలను మించి ఈ సినిమా వసూళ్లను కొల్లగొడుతుంది. అయితే క్లాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారన్న పాయింట్ మీదే ఈ సినిమా సక్సెస్ స్థాయి ఆధారపడి ఉంది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: భ్రమరాంబ (కూకట్‌పల్లి)