Breaking News

అయిపాయే… ఇక టీఆర్‌ఎస్‌ పని అయిపోయినట్లేనా?

1 0

తెలంగాణలో గత నాలుగు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రూ.వేలకు వేల కోట్లు కుమ్మరించారు. అయినా ప్రజలు సంయమనం, సహనం పాటించారు. చివరకు ఆత్మగౌరవం నినాదం ఎత్తుకున్న ఈటెల రాజేందర్‌కే ప్రజలు పట్టం కట్టారు. సుమారు 23వేల ఓట్లకు పైగా మెజారిటీని సాధించారు. దీంతో హుజురాబాద్ నుంచి ఈటెల వరుసగా 7వ సారి విజయకేతనం ఎగురవేశారు. ఇందులో మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ ఎన్నికలు ఉండటం విశేషం.

అయితే హుజురాబాద్‌లో ఎవరు గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుందని అందరూ భావించారు. కానీ 23వేల మెజారిటీ అంటే మాములు మాటలు కాదు. ఈ క్రెడిట్ అంతా ఈటెలకే దక్కుతుంది. అయితే ఈటెల గెలుపును చూసి బీజేపీ పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరూ బీజేపీని చూసి ఓట్లేయలేదు. కేవలం ఈటెలను చూసే ఓటు వేశారు. ఎందుకంటే కేసీఆర్ ఆయన్ను ఘోరంగా అవమానించి పార్టీ నుంచి బయటకు పంపారు. అసలు ఉన్నపళంగా ఈటెలను పార్టీ నుంచి బయటకు ఎందుకు పంపారన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అందుకే ప్రజలు ఈటెల వైపు నిలిచారు. తాజా ఫలితంతో 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది. ఇకనైనా కేసీఆర్ తన మాట తీరు, పద్ధతి మార్చుకోకుంటే లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.