ప్రస్తుతం హిట్ టాక్ వస్తేనే కలెక్షన్లు రాని పరిస్థితి నెలకొంది. అదే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం మిరాకిల్ జరిగిందనే చెప్పాలి. ఆ సినిమానే రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందD. ఈ సినిమాకు తొలుత ఫ్లాప్ టాక్ వచ్చింది. గతంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా పరువును తీసిందని చాలా మంది రివ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా బయ్యర్లకు మంచి లాభాలను అందించింది.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోనంకి ఈ మూవీని తెరకెక్కించింది. 12 రోజులకు ఈ మూవీ రూ.11.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.7.19 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి రూ.6 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగింది. అంటే రూ.6 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్‌కు వచ్చినట్లే. కానీ రూ.7 కోట్లకు మించి కలెక్ట్ చేయడంతో ఈ సినిమా హిట్ రేంజ్‌కు చేరుకుంది. కీరవాణి సంగీతం, హీరోయిన్ శ్రీలీల అందచందాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే ఈ మూవీకి పోటీ లేకపోవడం వల్లే కలెక్షన్లు వచ్చాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్లే. దసరా బరిలో మహాసముద్రం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో ఈ మూవీ పోటీగా విడుదలైంది. మహాసముద్రం అట్టర్ ఫ్లాప్ అవ్వగా.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో అఖిల్‌కు తొలి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.