ఐపీఎల్లో ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. 2021 సీజన్ అతడికి కెప్టెన్‌గా చివరిది కాబోతోంది. అంటే 2022 నుంచి ఆర్సీబీ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టింది. 2015, 2017, 2019లో తన అద్భుత బ్యాటింగ్‌తో వార్నర్ ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. 2016లో అయితే ఏకంగా సన్‌రైజర్స్ జట్టుకు టైటిల్ కూడా అందించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలాంటి వార్నర్‌ను ఈ సీజన్లో విఫలమయ్యాడనే కారణంగా ఏకంగా జట్టు నుంచే తప్పించారు.
అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆర్సీబీకి వార్నర్ కెప్టెన్‌గా నియామకం అవుతాడని భావిస్తున్నారు. ఆర్సీబీకి ఓపెనింగ్ స్థానంలో బలమైన ఓపెనర్ కావాలని.. వార్నర్ ఆ స్థానాన్ని పూడుస్తాడని చెప్తున్నారు. వార్నర్ రాకతో కోహ్లీ, డివిలియర్స్లపైనా ఒత్తిడి తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.