NAGA CHAITANYA LOVE STORY MOVIE REVIEW AND RATING
రేటింగ్: 3/5
తెలుగు ఇండస్ట్రీకి ప్రస్తుతం మంచి హిట్ సినిమా కావాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత డీలా పడ్డ థియేటర్లు మళ్లీ పుంజుకోవాలంటే ఓ చక్కటి ఫ్యామిలీ సినిమా అవసరం. ఈ నేపథ్యంలో విడుదలైన సినిమానే లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించి కనువిందు చేయడం ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా మంచి ఫీల్ కలిగించింది. సున్నితమైన అంశాన్ని శేఖర్ కమ్ముల చాలా బాగా డీల్ చేశాడు.
కథలోకి వెళ్తే… రేవంత్ (నాగచైతన్య) తక్కువ కులానికి చెందిన కుర్రాడు. అతడు జుంబా డ్యాన్స్ అకాడమీని స్థాపించి డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు మౌనిక (సాయిపల్లవి) అప్పర్ క్యాస్ట్‌కు చెందిన అమ్మాయి. మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె కల. అయితే అనుకోకుండా రేవంత్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తుంది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. దీంతో వీరిద్దరి మధ్య బంధం ఎక్కడి వరకు వెళ్లింది, వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నారో లేదో అన్నదే మిగతా స్టోరీ.
ఎక్కువ కులం, తక్కువ కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, వాళ్ల ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడం వంటి స్టోరీలు గతంలో వందల్లో వచ్చాయి. వాటిలో కొన్ని ఆకట్టుకున్నాయి. కొన్ని విఫలం చెందాయి. అయితే లవ్‌స్టోరీ సినిమా కూడా ఇంచుమించు ఇదే స్టోరీతో వచ్చినా.. ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాలను తాకడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను శేఖర్ కమ్ముల డీలింగ్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రేవంత్, మౌనిక పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి ఒదిగిపోవడం కూడా ఈ సినిమా సక్సెస్‌కు బాటలు వేసింది. వీళ్లిద్దరూ చాలా సహజంగా, మెచ్యూర్డ్‌గా నటించారు. సాయిపల్లవి డ్యాన్సులు ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లాయి.
ఈ సినిమాలో క్లైమాక్స్‌లో నాగచైతన్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరోవైపు చైతూ తల్లిగా ఈశ్వరీరావు చాలా బాగా నటించింది. రాజీవ్ కనకాల నెగిటివ్ రోల్‌లో కనిపించాడు. ఉత్తేజ్ పాత్ర కూడా కీ రోల్ పోషించింది. ఫస్టాఫ్‌లో కనిపించిన శేఖర్ కమ్ముల మార్క్ ఆహ్లాదం సెకండాఫ్‌లో మిస్ అయ్యింది. ఈ సినిమాలో సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్‌లో కులం సమస్యను ఎలా ముగించాలో తెలియక దర్శకుడు తడబడ్డాడు. ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ పవన్ సీహెచ్ సంగీతం. అతడు అందించిన సంగీతం, బీజీఎం సూపర్బ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. సన్నివేశానికి తగ్గట్లు వచ్చే పాటలు మంచి ఫీల్ అందిస్తాయి. లొకేషన్లు కూడా సూపర్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈ మూవీకి రిచ్‌నెస్ తీసుకువచ్చింది.
చివరగా.. ఓటీటీలకు అలవాటు పడి థియేటర్లలో మంచి సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ మూవీ మంచి ఛాయిస్. మంచి కథ, కథనం, పాటల కోసం ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. శేఖర్ కమ్ముల సెన్సిబుల్ డైరెక్షన్, నాగచైతన్య, సాయిపల్లవి నటన, పవన్ సీహెచ్ సంగీతం అన్ని అంశాలు కలిసి ఈ మూవీని హిట్ రేంజ్‌లో నిలబెట్టాయి. అయితే ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది అంతిమంగా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ‘ఉప్పెన’ లాంటి కథతోనే వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి)