టాలీవుడ్ ప్రస్తుతం ధీన స్థితిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ మంచి సినిమా విడుదల చేస్తే థియేటర్లలో కలెక్షన్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. దీంతో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ సినిమాపై టాలీవుడ్ గంపెడాశలు పెట్టుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మళ్లీ పూర్వ పరిస్థితులు నెలకొంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లవ్‌స్టోరీ సినిమాకు భారీ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలో లవ్‌స్టోరీ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారా 140k డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రిలీజైన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మాత్రం అమెరికాలో ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారా 120k డాలర్లు మాత్రమే రాబట్టింది. దీంతో వకీల్ సాబ్‌ను లవ్‌స్టోరీ దాటేసిందని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మూవీ విడుదల సమయంలో అమెరికాలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందుకే తమ హీరో సినిమాకు తక్కువ ప్రిరిలీజ్ బిజినెస్ జరిగిందని పవర్‌స్టార్ అభిమానులు చెప్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా లవ్‌స్టోరీ మూవీ 900కు పైగా థియేటర్లలో ఈనెల 24న విడుదలవుతోంది.