Breaking News

ఆర్‌సీబీ టైటిల్ గెలవాలంటే తక్షణం ఏం చేయాలి?

2 0

ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ నడుస్తోంది. 13 సీజన్‌లలో ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవలేదు. అయితే 14వ సీజన్‌లో అయినా ట్రోఫీని ముద్దాడాలని కోహ్లీ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. విరాట్ కోహ్లీకి సారథిగా ఇదే చివరి సీజన్. దీంతో ఎలాగైనా అతడి సారథ్యంలో ట్రోఫీని గెలిచి చూపించాలని ఆర్‌సీబీ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి మూడు పరాజయాలు, ఐదు విజయాలతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా మిగతా ఆరు మ్యాచ్‌లలో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిచి తీరాలి.

అందుకు తక్షణం చేయాల్సింది జట్టులో మార్పులు. ఆర్‌సీబీ జట్టు ముఖ్యంగా కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ మీద అతిగా ఆధారపడుతోంది. కానీ ఆ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారన్న సంగతి సారథి కోహ్లీ మరిచిపోతున్నాడు. అరోన్ ఫించ్, ఆడమ్ జంపా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా… డానియల్ క్రిస్టియన్, మహ్మద్ అజారుద్దీన్ లాంటి ఆటగాళ్లను తుది జట్టులో ఆడించాలి. శ్రీకర్ భరత్, పటీదార్ వంటి ఆటగాళ్లను కాస్త పక్కనపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి కానీ కీలక దశలో ప్రయోగాలు చేయకూడదు. మంచి జట్టును చేతిలో ఉంచుకుని ఆడించలేకపోతుందన్న అపప్రథ కోహ్లీ మూటగట్టుకోకుండా ఉండాలంటే కీలక ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది.

కోహ్లీ ఆడించాల్సిన తుది జట్టు: కోహ్లీ, పడిక్కల్, మ్యాక్స్ వెల్, సచిన్ బేబీ, డివిలియర్స్, మహ్మద్ అజారుద్దీన్, డానియల్ క్రిస్టియన్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, చాహల్