Breaking News

సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ మూవీ రివ్యూ

2 0

SANDEEP KISHAN GULLY ROWDY MOVIE REVIEW AND RATING

రేటింగ్: 2.5/5

యువ హీరో సందీప్ కిషన్‌కు మంచి హిట్ వచ్చి చాలా కాలమైంది. దీంతో కామెడీ జోనర్‌ను నమ్ముకుని గల్లీ రౌడీ అనే సినిమాలో అతడు నటించాడు. గతంలో సందీప్‌తో తెనాలి రామకృష్ణ అనే మూవీని తీసిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ మూవీని తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్‌లలో ఈ మూవీ ప్రామిసింగ్‌గా అనిపించింది. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి ఔట్ డేటెడ్‌ కామెడీ అని తేలిపోయింది.

కథలోకి వెళ్తే.. వాసు (సందీప్ కిషన్) సింహాచలం అనే పెద్దమనిషికి (నాగినీడు)కు మనవడు. అయితే తన మనవడిని పెద్ద రౌడీ చేయాలనేది ఆ పెద్దమనిషి కోరిక. కానీ వాసుకు మాత్రం రౌడీ కావడం ఇష్టం ఉండదు. ఆ సమయంలోనే తనను ఏడిపిస్తున్న ఓ రౌడీ ఆటకట్టించమంటూ సాహితి (నేహా శెట్టి) స్నేహితుడి సాయంతో వాసు దగ్గరకు వస్తుంది. ఆమెతో వాసు తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. దీంతో వారసత్వంగా వస్తున్న రౌడీయిజాన్ని వాసు స్వీకరిస్తాడా లేదా అన్నదే మిగతా కథ.

గల్లీ రౌడీ సినిమా కథ చాలా పాతది. తమ కుటుంబ పెద్దలను అవమానించిన వారిపై పగ తీర్చుకునే హీరోల కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో మాత్రం హీరో కక్షలు, పగలకు దూరంగా తన బతుకేదో తాను బతకాలని చూస్తుంటాడు. కానీ అలా జరగకపోవడంతో చివరకు కత్తి పట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యం మనకు బోలెడంత వినోదాన్ని పంచే అంశమే. కానీ లాజిక్‌లకు దూరంగా కథను నడపడంతో తేలిపోయింది. దూకుడు సినిమాలోని ఓ షాట్‌ను ఈ మూవీలో వాడుకున్నారంటే ఈ సినిమాను ఎంత పకడ్బందీగా తీశారో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ తప్ప ఈ సినిమాలో మిగతా భాగం పెద్ద ప్రహసనంలా ఉంటుంది. విలన్ బాబీ సింహా పాత్రను పరిచయం చేస్తూ ఇచ్చిన బిల్డప్ అయితే మామూలుగా లేదు.

గల్లీరౌడీగా సందీప్ కిషన్ నటన ఓకేగా ఉంది. వాసు పాత్రలో సందీప్ కిషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా కానీ అతను నటన పరంగా ప్రత్యేకంగా ఏమీ చేయడానికి ఈ పాత్ర అవకాశం ఇవ్వలేదు. రాజేంద్రప్రసాద్ పాత్ర పరమ రొటీన్‌గా ఉంది. పట్టపగలు వెంకట్రావు అనే హెడ్ కానిస్టేబుల్ పాత్రలో కాస్త నవ్వించినా ఆ పాత్ర ఇంపాక్ట్ అంతగా ఉండదు. హీరోయిన్ నేహా శెట్టి ఒక్కో చోట ఒకోలా ఉంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే కానీ ఆమె సెట్ కాకపోవచ్చు. ఉన్నంతలో వెన్నెల కిషోర్, షకలక శంకర్ కామెడీ కొంచెం బాగుంది.

టెక్నికల్ విభాగానికి వస్తే దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి సరైన ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నాడు కానీ కథ, కథనంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి కొత్తదనం ఉండేలా ప్రయత్నిస్తే ఫలితం బాగుండేది. సాయికార్తీక్, రామ్ మిరియాల అందించిన పాటల్లో ‘పుట్టెనె కాస్త ప్రేమ’ పాట ఫర్వాలేదు. నేపథ్య సంగీతం లౌడ్‌గా అనిపించింది. రచయిత కోన వెంకట్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు అని చెప్పడానికి ఈ సినిమా ప్రత్యక్ష ఉదాహరణ. నాగేశ్వరరెడ్డితో కలిసి ఆయన అందించిన స్క్రీన్‌ప్లే చాలా పాత స్టయిల్‌లో ఉంది. నిర్మాణ విలువలు కూడా అంత బాగోలేదు.

చివరగా… కరోనా సెకండ్ వేవ్ తర్వాత వినోద ప్రధాన చిత్రం థియేటర్లలో విడుదల కాలేదు. అలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న తరుణంలో.. సరదా కోసం కాసేపు నవ్వుకునేలా మాత్రమే ఈ సినిమా ఉంది. అసభ్యత, అశ్లీలత లేకున్నా కానీ అవుట్ డేటెడ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల సహనానికి ఈ సినిమా పరీక్ష పెడుతుంది. పాత కామెడీతో కాలక్షేపం చేయాలని భావిస్తే ఓసారి లుక్ వేయవచ్చు. అంత ఓపిక లేదు అని భావిస్తే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడం ఉత్తమం.

A REVIEW WRITTEN BY NVLR

THEATER WATCHED: అర్జున్ (కూకట్‌పల్లి)