Breaking News

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

4 0

NITHIN MAESTRO MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3.25/5

ఓటీటీ వేదికగా మరో సినిమా విడుదలైంది. గతవారం అమెజాన్ ప్రైమ్‌లో టక్ జగదీష్ మూవీ రిలీజ్ కాగా ఈ వారం డిస్నీ హాట్‌స్టార్ వేదికగా నితిన్ నటించిన ‘మాస్ట్రో’ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడనే చెప్పాలి. ఆద్యంతం థ్రిల్ అనిపించిన ఈ మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఉత్కంఠను అందించింది. ఈ మూవీలో కళ్లు లేని వాడిగా నటించేందుకు నితిన్ ధైర్యం చేసినందుకు అభినందించి తీరాల్సిందే.

ఇక కథలోకి వెళ్తే… అరుణ్ (నితిన్) చాలా టాలెంట్ ఉన్న యువకుడు. అతడికి పియానో అంటే ఎంతో ఇష్టం. అయితే అతడు గుడ్డోడిగా నటిస్తుంటాడు. కళ్లు లేనివాడిగా నటిస్తూ ఓ రెస్టారెంట్‌లో పియానో వాయిస్తుంటాడు. అలా సోఫీ(నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. అయితే ఓ సందర్భంలో మోహన్ (నరేష్) వాళ్లింటికి పియానో వాయించేందుకు అరుణ్ వెళ్తాడు. అక్కడ మోహన్ హత్య చేయబడి ఉంటాడు. కానీ గుడ్డోడిగా నటిస్తున్న అరుణ్ ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోతాడు. ఈ హత్య చేసిందెవరు? ఈ హత్యకు మోహన్ భార్య సిమ్రాన్ (తమన్నా)కు సంబంధమేంటి? అసలు అరుణ్ ఎందుకు కళ్లు లేని వ్యక్తిగా నటిస్తున్నాడు? నిజంగా అతడు గుడ్డోడు కాదా? అనే విషయాలు తెలియాలంటే తప్పనిసరిగా సినిమా చూడాల్సిందే.

బాలీవుడ్ మూవీ అంధాదున్ మూవీ చూడనివారికి ఈ సినిమా కావాల్సినంత థ్రిల్ అందిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ అంధాధున్ చూసిన వారికి ఈ సినిమా ఎంతటి అనుభూతి ఇస్తుందో అంటే చెప్పలేం. అంధాధున్‌ను రీ మేక్ చేసిన దర్శకుడు మేర్లపాక గాంధీ నూటికి నూరుశాతం న్యాయం చేశాడనే చెప్పాలి. మాతృకలోని ఆత్మను ఏ మాత్రం చెడకొట్టకుండా ‘అంధాదున్‌’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది. అంధుడైన అరుణ్‌ నటన ఫస్టాఫ్‌లో నవ్వులు పూయిస్తుంది. కీలకమైన హత్య జరిగిన సమయంలో అరుణ్‌ పరిస్థితి ఏంటో చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలియడంతో హత్య గురించి అతడు పోలీసులకు ఎలా చెబుతాడు అనే సన్నివేశాలు ఉత్కంఠతో పాటు నవ్వులు అందిస్తాయి.

‘అంధాదున్‌’లో ఆయుష్మాన్‌ ఖురానా అంధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అదే పాత్రలో నితిన్‌ తెలుగులో చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో సరదాగా నవ్వించిన అతడు సెకండాఫ్‌లో భావోద్వేగాలతో నటించి మార్కులు కొట్టేశాడు. హీరోయిన్ నభా నటేష్ పాత్ర పరిధి చిన్నదనే చెప్పాలి. ఆమెకు ఈ మూవీలో అంత ప్రాముఖ్యమైన పాత్ర లభించలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా తొలిసారిగా విలన్ పాత్రను పోషించింది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది కూడా. ఆమె చేసిన పని వల్లే కథలో మలుపులు చోటుచేసుకుంటాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాబీగా నటించిన జిషు సేన్ గుప్త, అతడి భార్య పాత్రలో యాంకర్ శ్రీముఖి కూడా బాగానే నటించారు. సెకండాఫ్‌లో అరుణ్, సిమ్రాన్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగడంతో కొంచెం బోర్ కొట్టినా థ్రిల్లర్ మూవీ కాబట్టి ఆ లోటు తెలియదు.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాతో మరోసారి అలరించాడు. రీమేక్ చేసిన తీరు బాగుంది. ఈ సినిమాలో మరో హైలెట్ సంగీతం. మహతి స్వరసాగర్ పాటలు అంత రిజిస్టర్ కాకపోయినా నేపథ్య సంగీతంతో అతడు ఆకట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కరోనా నేపథ్యంలో అతి తక్కువ లొకేషన్లలోనే సినిమా పూర్తి చేసినా సినిమా రిచ్‌గా కనిపించింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

చివరగా… ఇటీవల కాలంలో థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే వాటి జోనర్ వేరు.. మాస్ట్రో జోనర్ వేరు. మీరు మాత్రం హిందీ మూవీ అంధాధున్‌ను చూడకపోతే ఖచ్చితంగా మాస్ట్రో సినిమా చూసి థ్రిల్ ఫీలవుతారు. ఈ వీకెండ్‌లో సినిమా ప్రియులు ఎంజాయ్ చేయడానికి నితిన్ సినిమా మంచి ఛాయిస్. ఈ సినిమాను చూడటం మిస్ కాకండి.

A REVIEW WRITTEN BY NVLR