హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు రాజును బహిరంగంగా చంపాలని ప్రజలందరూ కోరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ ఊహించని విధంగా నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో గురువారం ఉదయం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి అతడు చచ్చిపోయాడని పోలీసులు వెల్లడించారు. అయితే అంతకంటే ముందే పోలీసుల అదుపులో రాజు ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ ద్వారా నిందితుడు రాజును పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే నిందితుడిని పోలీసులు పట్టుకోకపోయినా.. సమాచారం లోపం కారణంగా ఆ ట్వీట్ చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అసలు తెరవెనుక విషయానికి వస్తే నిందితుడిని పోలీసులే ఎన్కౌంటర్ చేసి చంపారని కొందరు ఆరోపిస్తున్నారు. అంతిమంగా రేపిస్ట్ రాజు చావాలనే అందరూ కోరుకున్నా అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కావడం లేదని కొందరు అంటున్నారు. అయితే రాజు ఫోన్ కూడా వాడకపోవడంతో అతడికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ పోలీసుల దగ్గర లేకపోవడంతో వాళ్లు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకున్నారు. దీంతో రాజు ఫోటోలను బహిరంగంగా విడుదల చేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. దీంతో నిందితుడికి దిక్కుతోచక చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.