Breaking News

నాని ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ

1 0

NATURAL STAR NANI TUCK JAGADISH MOVIE REVIEW

రేటింగ్: 2.5/5

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా వరుసగా రెండోసారి ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. గత చిత్రం ‘వి’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’ మూవీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలోనే విడుదలైంది. గత ఏడాది థ్రిల్లర్‌ను నమ్ముకుని మోసపోయిన నాని ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నమ్ముకున్నాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఈ మూవీ ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే.. భూదేవిపురం అనే గ్రామంలో నాయుడు (నాజర్) గారంటే అందరికీ గౌరవం. అయితే ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉంటారు. వీరంతా ఒక తల్లికి పుట్టకపోయినా ఆప్యాయతలతో మెలుగుతారు. ఆ ఇద్దరి కొడుకులే బోస్ (జగపతిబాబు), జగదీష్ నాయుడు (నాని). కాగా ఆ గ్రామంలో నాగేంద్ర అనే విలన్ అందరి భూములు కాజేద్దామని చూస్తుంటాడు. ఒకనాక సమయంలో నాయుడు చనిపోతూ బోస్‌కు బాధ్యతలు అప్పగిస్తాడు. నాయుడు మృతితో ఆ కుటుంబంలో కలతలు వస్తాయి. ఇంతకీ ఆ కలతలకు కారణం ఎవరు? అవి ఎలా పరిష్కారం అవుతాయో అన్నది మిగతా కథ.

ముందుగా టక్ జగదీష్ సినిమా చూస్తే ఇటీవల కార్తీ హీరోగా వచ్చిన చినబాబు సినిమా తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సినిమా కథ, ఈ సినిమా కథ లైన్ ఇంచుమించు ఒక్కటే. అయితే కార్తీ సినిమాలో మెలో డ్రామా ఎక్కువగా ఉంటుంది. అదే టక్ జగదీష్ సినిమాను మాత్రం ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ మూవీలో నాని మేనకోడలి పాత్రలో చంద్రమ్మగా ఐశ్వర్య రాజేష్ చాలా నేచురల్‌గా నటించింది. మావయ్య అంటే ఇష్టమున్నా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. మరో హీరోయిన్ రీతూవర్మ గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో వీఆర్వోగా నటించింది. ఆమె పాత్రలో పెద్దగా మెరుపులేమీ లేవు. అంతేకాక ఆమె క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత కూడా లేదు.

ఫస్టాఫ్ వరకు దర్శకుడు శివనిర్వాణ కథను బాగానే నడిపించాడు. అయితే సెకండాఫ్‌లో అతడు గాడి తప్పాడు. పైగా కథ పూర్తిగా ఊహించేవిధంగా ఉండటం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ మూవీ ఫర్వాలేదనిపించినా.. మిగతా జోనర్ వాళ్లను మాత్రం నిరాశపరుస్తుంది. నాని ఒక్కడే ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచాడు. చాలా బ‌రువైన పాత్ర‌ను నాని అవ‌లీల‌గా పోషించేశాడు. కానీ త‌న నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తున్నారో అది ఇవ్వ‌లేక‌పోయాడు. ఒకరకంగా చెప్పాలంటే నాని నటన కోసం ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. నాని తర్వాత జగపతిబాబు ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. విలన్‌గా డానియల్ బాలాజీ అంతగా సెట్ కాలేదు. టెక్నికల్ విభాగంలో దర్శకుడు శివ నిర్వాణ సెకండాఫ్‌లో నిరాశపరిచాడు. తమన్ పాటలు రిజిస్టర్ కాలేదు. నాని ఇంట్రడక్షన్ సాంగ్ తప్పితే అతడి సంగీతంలో ఈసారి మేజిక్ కనిపించలేదు. గోపీ సుందర్ బీజీఎం కూడా సోసోగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగోలేదు.

చివరగా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి నిర్మాతలు లాభపడ్డారనే చెప్పాలి. ముందు జాగ్రత్తతోనే అమెజాన్ ప్రైమ్ సంస్థకు ఈ సినిమాను అమ్మేసుకున్నారు. థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే దారుణమైన కలెక్షన్లు చూడాల్సి వచ్చేది. ఫస్టాఫ్ వరకు చూస్తే థియేటర్లలో ఇంకా ఎంజాయ్ చేసే అవకాశం ఉండేదేమో అనిపించిన ఈ మూవీ సెకండాఫ్ కారణంగా గ్రాఫ్ పడిపోయింది. అయితే ఫ్యామిలీతో కలిసి ఓసారి నాని కోసం చూడొచ్చు.

A REVIEW WRITTEN BY NVLR