SANDEEP KISHAN VIVAHA BHOJANAMBU MOVIE REVIEW AND RATING
రేటింగ్: 2.75/5
హీరో సందీప్ కిషన్ నిర్మాతగా, కమెడియన్ సత్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. కమెడియన్ హీరోగా నటిస్తాడు కథ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కేవలం కామెడీ కోసమే తీసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద మంచి కామెడీ సినిమా వచ్చి చాన్నాళ్లు అయ్యింది. జంధ్యాల, ఈవీవీ ఉన్నప్పుడు అన్ని కామెడీ ప్రధాన సినిమాలే వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అందం లేకపోయినా మా అమ్మాయి ప్రేమించింది. డబ్బు లేకపోయినా మా నాన్న పెళ్లికి ఓకే అన్నాడు. అసలు నువ్వు మా అమ్మాయికి ఎలా నచ్చావో నాకు తెలియడం లేదు అని హీరోయిన్ నాన్న చెప్తాడు. అదే ఈ సినిమా కథ. అయితే ఈ మూవీలో ఎమోషన్స్ కూడా పెట్టారు. ఓ సందేశం కూడా ఇచ్చారు. ఇలా పక్కదారి పట్టడంతో సినిమా గ్రాఫ్ పడిపోయిందనే చెప్పాలి. కథ, కథనాలు ఊహించేవే అయినా కామెడీ ఎలా ఉందనే దాని కోసం ఈ సినిమా చూడాలో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే.. మహేష్ (సత్య) ఎల్ఐసీ ఏజెంట్. చాలా డబ్బు పొదుపు మనిషి. అతడిని అనిత (ఆర్జేవీ రాజ్) ప్రేమిస్తుంది. అంద విహీనంగా ఉన్నా, డబ్బు లేకపోయినా అనిత కుటుంబం అయిష్టంగా వీరి పెళ్లికి ఒప్పుకుంటారు. పెళ్లయిన రోజు సరిగ్గా దేశమంతా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తారు. దీంతో అనిత కుటుంబం తప్పనిసరి పరిస్థితుల్లో మహేష్ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దీంతో డబ్బు పొదుపు చేసే మహేష్ వాళ్లను ఎలా భరించాడు? అతడు పడిన పాట్లేంటి? ఆ తర్వాత ఏం జరుగుతుందన్నదే మిగతా కథ.
ఈ సినిమా పాయింట్ లాక్డౌన్ మీద రాసుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఎంతో మంది కష్టాలను అనుభవించారు. అయితే పిసినారి ఇంట్లో 16 మంది ఇరుక్కుంటే అతడు ఏం చేశాడన్న పాయింట్‌తో కామెడీ పండించవచ్చు. దర్శకుడు దానినే నమ్ముకున్నాడు. అయితే చివరి వరకు ఒక్క పాయింట్‌ను లాక్కురాలేకపోయాడు. పస్టాఫ్‌ను బాగా డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో తడబడ్డాడు. కొత్త దర్శకుడు కావడంతో ఇది మాములే. ఈ మూవీలో మనం సత్యను హీరో కోణంలో కంటే కమెడియన్ కోణంలోనే చూస్తాం. శ్రీకాంత్ అయ్యంగార్, సత్య కాంబినేషన్ ఎపిసోడ్లు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచాయి. వాళ్లిద్దరూ కనిపించినప్పుడల్లా కడుపుబ్బా నవ్వుతాం. అయితే సుదర్శన్ నుంచి రావాల్సిన కామెడీ రాలేదు. ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో సప్తగిరి లాంటి పాత్రను చేద్దామని భావించి ఈ మూవీ నిర్మాత అంబులెన్సు డ్రైవర్‌గా సందీష్ కిషన్ పాత్రను దర్శకుడు ఇరికించి పెట్టాడనే భావించాలి.
పిసినారి పాత్రలో సత్య తన హావభావాలతో చక్కగా నవ్విస్తాడు. హీరోయిన్ ఆర్జేవీ తన పరిధిలో చక్కగా నటించింది. సత్య తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఈ సినిమాకు బలం. దివంగత నటుడు టీఎన్ఆర్, సుదర్శన్, సుబ్బరాయశర్మ, వైవా హర్ష తమ పాత్ర పరిధుల మేరకు నటించారు. ప్రధాన ఆకర్షణ అనుకున్న సందీప్ కిషన్ పాత్ర తేలిపోయింది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే అన్వీ సంగీతం ఫర్వాలేదు. సత్య కనిపించినప్పడల్లా ‘వాటే.. వాటే.. వాటే మ్యానూ’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలరించింది. పాటలు సోసోగా ఉన్నాయి. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మూవీ మొత్తం ఒకే ఇంట్లోనే సాగుతుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు సెకండాఫ్‌ను పకడ్బందీగా రాసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
చివరగా… ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు రాలేదు. కామెడీ ప్రధానంగా వచ్చిన ఈ సినిమాను అంచనాలు లేకుండా ఓసారి చూడవచ్చు. థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ కావడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా ఫాస్ట్ ఫార్వాడ్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ వీకెండ్లో మంచిగా ఎంజాయ్ చేద్దామనుకునేవారికి ఈ మూవీ గుడ్ ఛాయిస్ కాకపోయినా ఓ ఛాయిస్. లాజిక్ల జోలికి వెళ్లకుండా ఈ మూవీని ఆస్వాదిస్తే బానే ఉంటుంది.
A REVIEW WRITTEN BY NVLR
OTT RELEASED: సోనీ లివ్