Breaking News

శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

2 0

SRI VISHNU RAJA RAJA CHORA MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3/5

టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అలానే హీరో శ్రీ విష్ణుకు కూడా అతడి శైలి అతడికి ఉంది. కెరీర్ ప్రారంభం నాటి నుంచి అతడు భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కమర్షియల్‌ హంగులకు భిన్నంగా వాస్తవికత, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు మరోసారి శ్రీవిష్ణు అలాంటి జోనర్‌లోని సినిమానే చేశాడు. అయితే ఈసారి అతడికి పాజిటివ్ ఫలితం రావడం ఖాయంగా కనపడుతోంది.

కథలోకి వెళ్తే.. భాస్కర్ (శ్రీ విష్ణు) జిరాక్స్ షాపులో పనిచేస్తుంటాడు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని అబద్ధం చెప్పి సంజన (మేఘా ఆకాష్)ను లవ్‌లోకి దించుతాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తాడు. దీనికోసం డబ్బు అవసరం కావడంతో దొంగతనాలు చేస్తుంటాడు. అయితే ఒకసారి చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడతాడు. అయితే అతడికి ఇదివరకే విద్య (సునయన)తో పెళ్లయిందని, ఓ కుమారుడు కూడా ఉన్నాడని సంజనకు తెలుస్తుంది. ఆ తర్వాత భాస్కర్ జీవితం ఏమైంది? అతడు అసలు అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మిగతా కథ.

దొంగ అయిన వాల్మీకి రామాయాణాన్ని రాశాడనే అంశం నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు హసిత్‌ గోలి ఈ కథను రాసుకున్నాడు. బతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ యువకుడి జీవితంలో ఎదురైన పరిస్థితులకు వినోదం, ఎమోషన్స్‌ను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు. అబద్దాలతో బంధాలను నిలబెట్టడం సాధ్యం కాదనే సందేశాన్ని అండర్‌ప్లేగా దర్శకుడు ఈ మూవీలో చూపించాడు. కథ కొత్తగానే ఉన్నా కథనం సాదాసీదాగా ఉంది. దీంతో సెకండాఫ్ మరీ ఫ్లాట్‌గా అనిపించింది. ప్రథమార్థం మొత్తం సరదాగా సినిమాను నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని అందుకు భిన్నంగా తెరకెక్కించాడు. పూర్తి ఎమోషనల్‌గా తీర్చిదిద్దాడు. అయితే పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా సాగిపోయే కథనమే ‘రాజ రాజ చోర’ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే భర్తగా, దొంగగా, ప్రేమికుడిగా భిన్న కోణాల్లో హీరో శ్రీవిష్ణు ఈ మూవీలో చక్కటి నటనను కనపరిచాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు కూడా. అటు కథానాయికల్లో సునయన పాత్ర ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచింది. భర్త, కుటుంబ ప్రోత్సాహం లేకపోయినా కష్టపడి జీవితంలో పైకి రావాలని తపించే సగటు మహిళగా సహజ నటనతో ఆకట్టుకుంది. మరోవైపు మేఘా ఆకాష్‌ కెరీర్‌లో తొలిసారి అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కనిపించింది. విలన్‌గా రవిబాబు పాత్రను విభిన్నంగా దర్శకుడు తీర్చిదిద్దారు. గంగవ్వ, అజయ్‌ఘోష్‌తో పాటు ప్రతి పాత్రకు ఈ కథలో ప్రాముఖ్యత ఉంటుంది.

దర్శకుడు హసిత్‌ కథను రాసుకున్న విధానం బాగుంది. కానీ దానిని తెరపై ఆవిష్కరించడంలో అనుభవలేమి కారణంగా తడబాటుకు లోనయ్యాడు. వివేక్‌ సాగర్‌ సంగీతం బాగుంది. సినిమాలో పాటలు బాగున్నా తర్వాత గుర్తుండిపోయే స్థాయిలో అయితే లేవు. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సినిమా నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

చివరగా.. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా రూపొందిన చిత్రమిది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల్ని మెప్పించే ఈ చిత్రం బీ, సీ వర్గాలకు చేరువ అవుతుందా? లేదా? అన్నదానిపైనే ఈ సినిమా సక్సెస్ రేట్ ఆధారపడి ఉంది. కొంచెం నవ్వులు, కొంచెం ఎమోషన్, కొన్ని గిలిగింతల కోసం ఈ సినిమాను చూడొచ్చు. దర్శకుడు కథాకథనాలకు ఇంకొంచెం మెరుగులు దిద్ది ఉంటే ఈ సినిమా బలమైన సినిమాగా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)