Breaking News

అసలు తాలిబన్లు ఎవరు? వారంటే అప్ఘన్‌లకు ఎందుకు భయం?

2 0

ప్రపంచ వ్యాప్తంగా తాలిబన్లు అంటేనే ఇప్పుడు ప్రజలు వణికిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి తమ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు. దీంతో అఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్‌ల శకం మొదలైంది. ఇప్పటికే ఆక్రమించుకున్న ప్రదేశాల్లో తాలిబన్లు సామాన్యులపై ఆగడాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు బాలికలను కిడ్నాప్ చేస్తున్నారని అంటున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు అప్ఘనిస్తాన్ గురించే చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అసలు తాలిబన్లు ఎవరు..? వారంటే ఎందుకు అప్ఘనిస్తాన్‌లు భయపెడుతున్నారు?

తాలిబన్ అంటే పష్టో భాషలో విద్యార్థి అని అర్థం. 1990లో సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిదీన్ వర్గాలు రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏరాటు చేశాయి. అయితే వారు పరిపాలన మీద దృష్టిసారించకుండా నిరంతరం కలహాలతో మునిగి తేలుతూ ఉండేవారు. పాకిస్తాన్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫఖ్తూన్ హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. ఇందులో సున్నీలు ఎక్కువగా పాల్గొనే వారు. వీరికి సౌదీ అరేబియా దేశం నుంచి సహకారం ఉండేది. 1994లో తాలిబన్లు ముల్లా ఉమర్ నెట్ నాయకత్వంలో అప్ఘనిస్తాన్‌లో సుస్థిరత నెలకొల్పేందుకు రంగంలోకి దిగారు. ఇస్లామిక్ విద్యాసంస్థలలో చదువుకున్న తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ముజాహిదీన్ పాలనకు చెక్ పెట్టారు. 1998 నాటికి తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను 90 శాతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారి పాలనలో అఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి ఘటనలకు ముజాహిదీన్ నాయకులు పాల్పడటంతో ఆ దేశంలో అరాచకం తాండవించింది.

మరోవైపు తమ పాలనలో మోసం చేసినవారిని ఉరి తీయడం దొంగతనం చేసిన వారికి కాళ్లు చేతులు విరగ్గొట్టడం చేసేవారు తాలిబన్లు. అలాగే పురుషులందరూ కచ్చితంగా గెడ్డం పెంచాలనే నిబంధన పెట్టారు. మహిళలు బురఖా ధరించాలని చెప్పారు. అలాగే టీవీ చూడొద్దని సినిమాలకు వెళ్లొద్దని సంగీతాన్ని వినొద్దని ఆదేశించేవారు. 10 ఏళ్లు నిండిన అమ్మాయిలను ఇంటిపట్టునే ఉండాలని చెప్పేవారు. మరోవైపు వీరి ఆగడాలకు సౌదీ అరేబియా, యూఏఈతో పాటు పాకిస్తాన్ కూడా మద్దతు ఇచ్చేది. 2012లో మింగోరా పట్టణంలో మలలా యూసఫ్ జాయిపై తాలిబన్లు జరిపిన కాల్పులపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. రెండేళ్ల తరువాత పాకిస్తాన్లోని పెషావర్‌లో స్కూలు పిల్లలపై జరిగిన దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబన్ల ప్రాధాన్యాన్ని తగ్గించింది. 2013లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాలిబన్‌కు చెందిన హకీముల్లా మెహసూద్ మరణించాడు.

అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో బిన్ లాడెన్ తలదాచుకున్నాడు. దీంతో 2001 అక్టోబర్ 7న అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ పై దాడులు నిర్వహించాయి. ఈ దాడులతో తాలిబన్లు అధికారాన్ని విడిచి పారిపోయారు. దీంతో 20 ఏళ్లుగా అమెరికా తమ మిలటరీ బలగాలను రంగంలోకి దించి తాలిబన్‌లతో పోరాటం సాగిస్తోంది. అయితే ఇటీవల అమెరికా తాలిబన్ల మధ్య జరిగిన సుధీర్ఘ చర్చల తరువాత 2020 ఫిబ్రవరిలో తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చింది. దీంతో 2021 ఏప్రిల్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా సేనలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాడు. అనుకున్నట్లుగా చేశారు. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తారని, తమపై సున్నీ తీవ్రవాదులు దాడులు చేస్తారేమోనని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భయపడుతూ తమ దేశాన్ని విడిచిపోయేందుకు సిద్ధపడుతున్నారు.