శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన శ్రావణ మాసం.. సెప్టెంబర్ 6తో ముగియనుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు 12 నెలలు ఉంటాయి. వాటిలో ఐదో మాసం శ్రావణ మాసం. ఈ నెలలో ప్రత్యేక పూజలు చేయడం నోములు చేసుకోవడం వంటివి మహిళలు చేస్తూ ఉంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కూడా శ్రావణ మాసంలో పూజలు చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి.
శ్రావణమాసం విశిష్టత
ఈ మాసంలో ఉపవాసం మొదలు పూజలు వరకు భక్తి శ్రద్ధలతో మహిళలు చేసి తమ ఇష్టదైవాన్ని కొలుస్తారు. అలాగే చాలా మంది ఇళ్లల్లో ఈ నెలంతా కూడా మాంసం ముట్టుకోరు. శ్రావణ మాసంలో విష్ణుమూర్తిపై లక్ష్మీదేవి అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది అని నానుడి. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొని స్వామి వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుండి ఆవిర్భవించినట్లు చెబుతూ ఉంటారు. అయితే అమ్మ వారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటకు వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడని అంటారు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్దఎత్తున పూజలు చేస్తారు.
శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు
ప్రధానమైన పండుగలు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు మనకు అనుకూలంగా ఉన్నవి ఎంచుకుంటే మనో వాంఛ సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు. ఈనెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి ఉన్నాయి. 14వ తేదీన లక్ష్మీ వెంకటేశ్వర వ్రతం, 15న నరసింహ వ్రతం. 20వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 23న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం ఇలా పండుగలన్నీ ఈనెలలో వస్తుంటాయి. ఇక ఈనెల 30వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 7నుంచి భాద్రపదమాసం ప్రారంభమవుతుంది. శుభకార్యాలు చేసుకునేందుకు ఈనెలలో మంచి రోజులంటే 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31, సెప్టెంబర్ 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయని ప్రముఖ పండితులు చెబుతున్నారు.