Breaking News

‘SR కళ్యాణమండపం’ మూవీ రివ్యూ

2 1

KIRAN ABBAVARAM SR KALYANA MANDAPAM MOVIE REVIEW AND RATING

రేటింగ్: 2.25/5

కొన్ని సినిమాలు టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేపుతాయి. కానీ అసలు సినిమా దగ్గరకు వచ్చేసరికి చతికిలపడుతూ ఉంటాయి. తెలుగు సినిమాకు ఇదేమీ కొత్త కాదు. గతంలో ఎన్నో సినిమాలు ఈ బాపతు అనిపించుకున్నాయి. ఈ జాబితాలో SR కళ్యాణమండపం సినిమా కూడా చేరిపోయింది. ప్రోమోలతో ఆసక్తిని రేపిన ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారిందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక కథలోకి వెళ్తే.. కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) స్నేహితులతో కలిసి సరదాగా గడిపే మిడిల్ క్లాస్ యువకుడు. అతడు సింధు (ప్రియాంక జువాల్కర్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. మరోవైపు తన తాత ఆధ్వర్యంలో గొప్పగా నడిచిన SR కళ్యాణమండపాన్ని నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. తన తండ్రి కారణంగా మూలన పడిన ఆ మండపాన్ని మళ్లీ ఒక స్థాయికి తెచ్చేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో కళ్యాణ్‌కు ఎదురైన ఇబ్బందులేంటి? సింధుతో తన ప్రేమ విషయంలో ఎలా జయిస్తాడు అనేది మిగతా కథ.

ఈ చిత్రంలో కథ చిన్న పాయింట్ అయినా క్లారిటీగా తెరకెక్కించడంలో దర్శకుడు తికమకపడ్డాడు. సినిమా ఆద్యంతం సినిమాటిక్‌గా నడవడంతో ప్రేక్షకులు ఈ కథలో లీనమయ్యే అవకాశమే దర్శకుడు ఇవ్వలేదు. తండ్రీ కొడుకుల మధ్య బంధం, ఎమోషన్‌ను ఏదో మొక్కబడిలా తీసినట్లు అనిపిస్తుంది. కథలో కీలకమైన సన్నివేశాలను దర్శకుడు ఆషామాషీగా తెరకెక్కించాడు. అయితే ఇందులో స్కిప్ట్ బలహీనత ఉండొచ్చు. హీరో పాత్రకు మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చారు. కొన్ని సీన్లను అయితే అనవసరంగా ఇరికించారనే ఫీలింగ్ కలుగుతుంది.

హీరో కిరణ్ అబ్బవరంకు ఇది రెండో సినిమానే. తొలి సినిమా రాణివారు రాజావారుతో ఆకట్టుకున్న అతడు ఈ సినిమాలో మంచి నటనే కనపరిచినా బిల్డప్ రాజాలా మిగిలాడు. కటౌట్‌కు తగ్గట్లుగా కాకుండా మాస్ సీన్లు పెట్టడంతో అతడు సూట్ కాలేదనిపిస్తుంది. కాకపోతే స్క్రిప్టు కూడా తనే డీల్ చేసిన ఈ సినిమాలో తనకు తాను అంత బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నాడో ప్రేక్షకులకు అర్థం కాకుండా తయారైంది. హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ చేసిందేమీ లేదు. ‘తిమ్మరుసు’ తరహాలో ఈ సినిమాలో కూడా ఆమె నిరాశపరిచింది. ఉన్నంతలో సాయికుమార్ ఒక్కడే తన పాత్రకు న్యాయం చేశాడనిపించింది. ఈ మూవీలో తనికెళ్ల భరణిది చిన్న పాత్రే అయినా ఉన్నంతసేపు ఆకట్టుకుంటాడు.

ఈ మూవీకి నిస్సందేహంగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతమే. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ అందించిన పాటలు ఫర్వాలేదనిపించాయి. ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగోలేదు. దర్శకత్వ పరంగా కొత్త దర్శకుడు శ్రీధర్ దారుణంగా నిరాశపరుస్తాడు. ఎడిటింగ్ కూడా అతడే నిర్వహించడంతో సినిమాకు తలాతోక లేకుండా పోయింది. కథ, కథనాలు పాతచింతకాయ పచ్చడిని తలపిస్తాయి. పాయింట్ చిన్నగా ఉన్న సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా పండితేనే ఆ సినిమా అందరికీ నచ్చుతుంది.

చివరగా.. ఎస్.ఆర్.కళ్యాణమండపం మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ఆశించిన ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. అసలే ఒకవైపు కరోనా, మరోవైపు ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈ టైంలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావించడం అత్యాశే అవుతుంది. తెలుగు సినిమా గాడిలో పడాలంటే పెద్ద సినిమాలు విడుదల కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చే లాభం శూన్యం.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: అర్జున్ (కూకట్‌పల్లి)