Breaking News

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ మూవీ రివ్యూ

2 0

SATYADEV TIMMARUSU MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3/5

సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. జనాలు ఓటీటీలకు అలవాటు పడటంతో మంచి సినిమాలు వస్తేనే థియేటర్‌కు వెళ్దామని ప్రేక్షకులు దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘తిమ్మరుసు’ అనే సినిమా మంచి కథతో పాటు కథనంతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ హీరోగా పేరున్న సత్యదేవ్ నటించిన ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్‌లో ఎందుకు విడుదలైందో ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది.

కథ విషయంలోకి వెళ్తే.. రామచంద్ర (సత్యదేవ్) లాయర్‌గా పనిచేస్తుంటాడు. సామాన్యులకు ఉచితంగా సేవ చేయాలంటే అతడికి ఎంతో ఇష్టం.అయితే ఓ క్యాబ్ డ్రైవర్ హత్య చేయని కేసులో కొన్నేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. ఈ కేసును రామచంద్ర టేకప్ చేస్తాడు. దీంతో ఆ కేసు పలు మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. చివరకు ఈ కేసు ఏమైందనేది మిగతా కథ.

ఓ కన్నడ సినిమా ఆధారంగా తెరకెక్కిన ‘తిమ్మరుసు’ నిస్సందేహంగా ఓ థ్రిల్లర్ మూవీ. సినిమా ఆరంభం మాములుగా అనిపించినా ఆ తర్వాత ఈ మూవీ ప్రేక్షకుడికి మంచి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. అయితే కేసును వాదించే అంశంపై ఇటీవల ‘వకీల్ సాబ్’ వచ్చినా ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. ‘నాంది’ సినిమా కూడా ఈ లైన్‌తోనే తెరకెక్కినా అది ఎమోషన్ బేస్డ్ మూవీ. కానీ ‘తిమ్మరుసు’ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో ముందుకు వెళ్తుంది. ఇందులోని ట్విస్టులు సినిమాకు ప్రాణం పోశాయి.

హీరో సత్యదేవ్ కెరీర్‌లో ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌లో ఓటీటీల్లో అతడి సినిమాలు వరుసగా విడుదలై మంచిపేరు సాధించి పెట్టాయి. ముఖ్యంగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అతడికి మంచి పేరు తెచ్చింది. దీంతో సత్యదేవ్ ఓటీటీ హీరో అయిపోయాడు. తాజాగా విడుదలైన ‘తిమ్మరుసు’లో సత్యదేవ్ నటన చూస్తే అతడి ప్రతిభ అర్థమవుతుంది. ఇంతలా అతడి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సినిమాలో సన్నివేశాల బలం తగ్గిన ప్రతిసారి అతడు తన ప్రతిభ చూపించి ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు.

ఇక హీరోయిన్‌గా ‘టాక్సీవాలా’ ఫేం ప్రియాంక జువాల్కర్ నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చెప్పుకోదగ్గదేమీ కాదు. ఉన్నంతలో బ్రహ్మాజీ కాస్త నవ్విస్తాడు. చేయని నేరానికి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించే కుర్రాడిగా అంకిత్ ఆకట్టుకున్నాడు. పాటలు లేని ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్లస్ అయింది. కన్నడ సినిమాను దర్శకుడు శరణ్ బాగా తెరకెక్కించాడు. ప్రథమార్థంలో సినిమా కొంచెం బోర్ కొట్టించినా.. ద్వితీయార్థం ఆ లోటును పూడుస్తుంది.

చివరగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘తిమ్మరుసు’ మంచి ఛాయిస్. థియేటర్లలో చూడటానికి ఈ సినిమాకు అర్హత ఉంది. ఎందుకంటే ఓటీటీల్లో థ్రిల్లింగ్ సినిమాలను చూస్తున్నప్పుడు ఆత్రుతతో మనం ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంటుంది. థియేటర్లలో ఆ అవకాశం ఉండదు కాబట్టి ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే ఆ ఉత్కంఠలో ఎంతో థ్రిల్ ఉంటుంది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: విశ్వనాథ్ (కూకట్‌పల్లి)