VICTORY VENKATESH NARAPPA MOVIE REVIEW AND RATING
రేటింగ్: 2.5/5
థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. వెంకీకి రీమేక్‌లు చేయడం కొత్తేమీ కాదు. అతడి కెరీర్‌లో ఎన్నో రీమేక్‌లను తెలుగులో సక్సెస్‌లుగా మార్చి చూపించాడు. లేటు వయసులోనూ మరో రీమేక్‌తో వెంకీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘అసురన్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగు నేటివిటీతో తెరకెక్కినా అక్కడక్కడా గాడి తప్పింది. తెలుగులో పగ, ప్రతీకారాలతో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. అయితే ‘నారప్ప’ను ఎమోషనల్‌గా చూపిద్దామని భావించిన దర్శకుడి ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. పూర్తిగా బెడిసికొట్టలేదు.
కథలోకి వెళ్తే… రామసాగరం అనే ఊరిలో పాండుసామి అనే భూస్వామి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గ్రామంలోని భూములన్నీ లాక్కోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే నారప్ప (వెంకటేష్)కు చెందిన 3 ఎకరాల భూమి అతడికి దక్కదు. నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి). వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. పెద్దకొడుకు ముని ఖన్నా ఆవేశపరుడు. ఓ సందర్భంగా తన అమ్మను పాండుసామి కొడుకు కొట్టడంతో అతడికి మునిఖన్నా ఎదురుతిరుగుతాడు. దీంతో తనకు జరిగిన అవమానంతో పాండుసామి మునిఖన్నాను చంపేస్తాడు. అయినా నారప్ప కూల్‌గానే ఉంటాడు. కానీ చిన్న కొడుకు చిన్నప్ప పగతో పాండుసామిని చంపేస్తాడు. దీంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నారప్ప చిన్నప్పతో కలిసి అడవిలోకి పారిపోతాడు. అసలు నారప్ప చేతకానివాడిలాగా ఎందుకు ఉంటాడు, అతడి గతం ఏంటి, చివరకు నారప్ప తన చిన్నకొడుకును కాపాడుకున్నాడా లేదా అన్నదే మిగతా కథ.
నారప్పగా ఈ మూవీలో వెంకటేష్ అదరగొట్టాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో వయసు మళ్లిన తండ్రిగా, సెకండాఫ్‌లో ఊరి సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా డిఫరెంట్ లుక్స్‌లో వెంకీ కనిపిస్తాడు. ఫస్టాప్‌లో రోషం లేని తండ్రిగా, తాగుబోతు క్యారెక్టర్‌లో పరిణితి చెందిన నటనను వెంకీ కనపరుస్తాడు. అన్నకు బదులు నువ్వు చచ్చిపోయినా బాగుండేదని చిన్నకొడుకు గేలి చేసిన సందర్భంగా వెంకీ నటన అదుర్స్. సుందరమ్మ పాత్రలో ప్రియమణి తన పరిధిలో నటించింది. అయితే ఆమెది చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాదు. ముని ఖన్నాగా కార్తీక్ రత్నం, బసవయ్యగా రాజీవ్ కనకాల, వరదరాజులుగా రావురమేష్, శంకరయ్యగా నాజర్ బాగా నటించారు.
ఉన్నోడు, లేనోడు అన్న కథలతో ఇప్పటికే చాలా కథలు వచ్చినా ఈ సినిమాను ఎమోషనల్ డ్రామాగా ‘అసురన్’ తెరకెక్కి విజయం సాధించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ సినిమా ఆత్మను ఫాలో అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులకు నప్పేలా కథ, కథనాలు రాసుకోలేకపోయాడు. అలా అని అతడి ప్రతిభని తక్కువ చేయలేం. ఎప్పుడో 1970 కథతో ఇప్పుడు సినిమా తీయడం సాహసమే అయినా కథ అంతా ఊహించగలిగేలా ఉండటం పెద్ద మైనస్‌గా మారింది. సినిమా ప్రారంభంలోనే ‘పేదోడికి మతం, కులం ఉండవు.. డబ్బున్నోడికి మంచి, మానవత్వం ఉండవు’ అన్న ఒక్క డైలాగ్‌తో ఈ సినిమా లైన్ అర్థమైపోతుంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే మణిశర్మ ఈ చిత్రానికి రెండు, మూడు పాటలు అందించినా వాటిలో కొన్ని బ్యాక్ గ్రౌండ్ పాటల్లానే మిగిలిపోయాయి. బీజీఎంను తమిళం నుంచి డిటో దింపేశారు. శ్యాం.కె.నాయుడు ఫొటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ యావరేజ్‌గా ఉన్నాయి. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను బాగా చూపించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. సినిమాలో నరుకుడు, రక్తపాతం హైలెవల్‌లో చూపించారు.
చివరగా.. అసురన్ సినిమా చూసిన వారికి ఈ సినిమా రుచించకపోవచ్చు. కానీ నేరుగా తెలుగు వెర్షన్ చూసిన వారికి మాత్రం ఈ మూవీ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కథ, కథనాలు పాతచింతకాయపచ్చడి లాగే ఉన్నా… వెంకీ నటన, పల్లెటూరి నేపథ్యం, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఈ మూవీని చూడొచ్చు.
A REVIEW WRITTEN BY NVLR