కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. ఇప్పటికే డజన్ ఓటీటీలున్నా అన్నింటికి మంచి ఆదరణ ఉంది. వెబ్ సిరీస్‌లతో పాటు చిన్న బడ్జెట్ సినిమాల కోసం జనం ఓటీటీలను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే మంచి పాపులారిటీ ఉన్న అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్ లకు తోడుగా ఇప్పుడు ఈటీవీ గ్రూప్ నుండి ఓటీటీ సంస్థ రాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రచయితలకు ఈటీవీ ఓటీటీ నుంచి ఆహ్వానం అందింది. మంచి కథలు రాసే రచయితలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఈటీవీ గ్రూప్ ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా ఈటీవీ వద్ద వందలాది సినిమాలున్నాయి. పలు క్లాస్ సినిమాలు ఈటీవీ వద్ద ఉండటం అదనపు అడ్వాంటేజ్ గా వారు భావిస్తున్నారు. అంతేకాదు 200కోట్ల ప్రత్యేక బడ్జెట్ తో టాక్ షోలు, వెబ్ సిరీస్‌లు, చిన్న బడ్జెట్ సినిమాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వాటిని ఓటీటీ నుండి రిలీజ్ చేసేలా ఈటీవీ గ్రూప్ ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.