Breaking News

ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ

2 0

రేటింగ్: 1.5/5

తెలుగులో ఇప్పటికే మాఫియాతో ముడిపడి ఉన్న చాలా సినిమాలు వచ్చాయి. కథా బలం ఉన్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే తలా, తోక లేని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ధనుష్ ‘జగమే తంత్రం’ రెండో కోవకు చెందినదే. ఎన్నో అంచనాలతో నెట్ ఫ్లిక్స్‌ వేదికగా డైరెక్టుగా రిలీజైన ఈ చిత్రం ఉసూరుమనిపించింది. బ్రిటన్‌లోని భారీ గ్యాంగ్ లీడర్ కు మదురైలో ఓ పరోటా కొట్టు నడిపే చిన్న గ్యాంగ్ లీడర్ హీరో కాస్తా కాంట్రాక్ట్ దాదాగా కావాల్సి రావడం లాంటివి మన సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటి చిత్ర, విచిత్రమైన ఊహలకు వెండి తెర రూపమే ఈ సినిమా.

కథ విషయానికి వస్తే… లండన్‌లో పీటర్ (జేమ్స్ కాస్మో), శివదాస్ (జోసెఫ్ జోజు జార్జ్) ఇద్దరూ రెండు వేర్వేరు గ్యాంగ్‌లకు లీడర్లు. ఇరు వర్గాల చెరో హత్యతో సినిమా మొదలవుతుంది. అదే సమయంలో మదురైలో పరోటా కొట్టు నడుపుతూనే, లోకల్ దాదాగా ఎదిగిన వ్యక్తి సురుళి (ధనుష్). పదుల కొద్దీ హత్యలు చేసిన హీరోను శివదాస్‌కు అడ్డుకట్ట వేయడానికి ఓ నెల రోజుల పాటు కాంట్రాక్ట్ దాదాగా లండన్ రప్పిస్తాడు పీటర్. హీరో అక్కడ శివదాస్ నే నమ్మించి, మోసం చేస్తాడు హీరో. శరణార్థుల కోసం పనిచేస్తున్న శివదాస్ అండ్ గ్యాంగ్ చేస్తున్న మంచి పని తెలియకుండానే, తెలుసుకోకుండానే ఆయనను చంపేస్తాడు. జాత్యహంకారి అయిన పీటర్ ఆ దేశంలో శరణార్థులకు చోటు లేకుండా చేసే చట్టాన్ని తీసుకురావడం కోసం అదంతా చేస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. ద్రోహిగా ముద్ర పడి, చివరకు కన్నతల్లి సైతం అసహ్యించుకొనే స్థితికి చేరిన హీరో తన పాప ప్రక్షాళన కోసం ఏం చేశాడు? చివరకు ఏం జరిగిందన్నది మిగతా కథ.

ధనుష్ ఎప్పటి లానే తన ఆకారానికి సంబంధం లేని ఆట, పాట, ఫైట్లు, తుపాకీలు పేల్చడాలతో హడావిడి చేశాడు. విలన్ ఛాయలుండే ఇలాంటి హీరో పాత్రలు చేయడం అతడికి కొత్త కాదు. చూడడం ప్రేక్షకులకూ కొత్త కాదు. కాకపోతే, ఈసారి ధనుష్ నటన కన్నా హీరోయిజానికే అతిగా ప్రాధాన్యం ఇచ్చినట్టున్నారు. మొదట రైలులో మర్డర్ దగ్గర నుంచి క్లైమాక్స్ లో దీపావళి టపాసులు, తుపాకీలు పేల్చినట్టు మెషిన్ గన్ ఆపరేట్ చేయడం దాకా ఈ తమిళ స్టార్ హీరో… ఏకంగా సూపర్ హీరో అనిపించేస్తాడు. ఆ ప్రయాణంలో ఆ పాత్ర, ఆ నటుడు సహజత్వం కోల్పోయాడు.

గతంలో ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ లాంటి సినిమాలతో విభిన్నమైన తమిళ సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ తన స్వీయ రచన, దర్శకత్వంలో ఈసారి బాగా నిరాశపరిచాడు. లండన్‌లో క్రూరమైన మాఫియా లీడర్ లాంటి విలన్ ఎక్కడో మదురైలోని తమిళ దాదా సాయం కోరడం ఓ ఫార్సు. అన్నేళ్ళుగా అక్కడ శివదాస్ అండ్ కో చేస్తున్న దందా ఏమిటో, దాని ఆనుపానులు ఏమిటో అంత లావు విలన్‌కు హీరో చెప్పేటప్పటి దాకా తెలియదనడం మరో జోక్. వారానికి రెండు మిలియన్ల పౌండ్ల కిరాయికి లండన్ వచ్చిన ఇంగ్లీషైనా రాని మదురై హీరో రెండ్రోజుల్లో శివదాస్ గ్యాంగ్ వ్యవహార శైలి అంతా చెప్పేస్తుంటాడు. అదేమిటో అతనికి అన్నీ అలా తెలిసిపోతుంటాయి.

హీరోయిజం మీద చూపిన శ్రద్ధలో కాస్తంత కథ మీదా పెడితే బాగుండేది. కన్వీనియంట్ స్క్రీన్ ప్లే, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ లాంటి వెన్నో ఈ చిత్రాన్ని కుంగదీశాయి. ‘శ్రీలంకలో తమిళుణ్ణి. తమిళనాడులో నేను శరణార్థిని’ అంటూ ఓ పాత్ర తన ఉనికి కోసం, తన మూలాల కోసం ఆవేదనతో అనే మాటలు ఆలోచింపజేసేవే. కానీ, ఆ బరువైన అంశాల్ని ఎంతో గొప్ప నిర్మాణ విలువలతో తెరకెక్కించినా కథలో పస లేకపోవడంతో సినిమా చాలా భారంగా మారింది.

లోకేషన్‌లు, నిర్మాణ విలువలు బాగున్నా లాజిక్ లేని బలహీనమైన కథ, కథనం, బోలెడన్ని రచన, దర్శకత్వ లోపాలు, కన్వీనియంట్ స్క్రీన్ ప్లే కథకు అతకని శరణార్థుల అంశం, పిచ్చి హీరోయిజం, పొసగని పాటలు ఈ సినిమాకు మైనస్‌గా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడతాయి. చివరగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా ఓటీటీలో చూడటం కూడా దండగే.

A REVIEW WRITTEN BY NVLR