Breaking News

‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ రివ్యూ

3 0

రేటింగ్: 4/5

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. అన్ని ఓటీటీలు ముఖ్యంగా వీటిమీదే దృష్టి సారించాయి. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ మేన్ 2 ఎంతో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తెలుగులో వెబ్‌ సిరీస్‌లకు, ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరిగింది. సినిమా థియేటర్లు మూసివేయడం, కొత్త సినిమాలు విడుదల కాకపోతుండటంతో ప్రేక్షకులు వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. ఇటీవల యూత్‌ను బాగా అట్రాక్ట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ ‘30 వెడ్స్ 21’. మౌత్ టాక్ వల్ల ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. యూత్‌ను ఆకర్షిస్తున్న ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉంది.

30 ఏళ్ల పృథ్వీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. అయితే అతడికి పెళ్లి కాదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. నాన్న ఒత్తిడితో అనుకోని పరిస్థితుల్లో 21 ఏళ్ల అమ్మాయి మేఘనను పెళ్లి చేసుకుంటాడు. అయితే తన కంటే చాలా చిన్న వయసు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే గిల్టీ ఫీలింగ్‌తో అతడు బాధపడుతుంటాడు. తన పెళ్లి విషయాన్ని కూడా ఫ్రెండ్స్‌తో పంచుకోలేకపోతాడు. కానీ మేఘన మాత్రం వయసు తేడాలేవి పట్టించుకోకుండా నార్మల్‌గా ఉంటుంది. భర్తతో కలిసిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది. దీంతో భిన్న కోణాలు కలిగిన భార్యాభర్తల జీవితం ఎలా సాగింది? ఈ క్రమంలో వారికి ఎదురైన చిలిపి కష్టాలు ఏంటి? అనేది మిగతా కథ.

30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం జరిపితే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్‌ సిరీసే 30 వెడ్స్‌ 21. తొలుత ఐదు ఎపిసోడ్లను విడుదల చేసిన నిర్వాహకులు తాజాగా ఆరో ఎపిసోడ్‌ను కూడా విడుదల చేశారు. ఈ ఆరు ఎపిసోడ్స్‌ కూడా చాలా ఫన్నీగా సాగుతాయి. ముఖ్యంగా మొదటి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. కాన్సెప్ట్‌ కాస్త పాతదే అయినా.. డీల్‌ చేసిన విధానం చాలా ఫ్రెష్‌గా ఉంది. మొదటి రెండు ఎపిసోడ్స్‌ని ఎంటర్‌టైనింగ్‌గా మలిచిన దర్శకుడు… మిగతా ఎపిసోడ్స్‌ని కాస్త రొటీన్‌గా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయినప్పటికీ.. ఎమోషన్స్‌ సీన్లు మాత్రం అంతగా పండలేదు.

ఈ వెబ్ సిరీస్‌లో హీరో కంటే కూడా బాగా పండిన పాత్ర అతడి ఫ్రెండ్ పాత్ర. హీరో ఫ్రెండ్‌గా కార్తీక్ పాత్రలో నటించిన వ్యక్తి మంచి ఫన్ అందించింది. అతడు కనిపించినప్పుడల్లా బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కార్తీక్.. కార్తీక్.. కార్తీకే’ అంటూ వచ్చిన బీజీఎం భలేగా ఉంది. ఇక 30 ఏళ్ల బ్యాచిలర్‌ పృథ్వీ పాత్రలో చైతన్యరావు ఒదిగిపోయాడు‌. పెళ్లి విషయం బయటపెట్టకుండా ఉండేందుకు భార్య చెప్పే పనులు చేస్తూ నవ్వులు పూయించాడు. సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 21 ఏళ్ల మేఘన పాత్రలో అనన్య పరకాయ ప్రవేశం చేసింది. అద్భుత పెర్ఫామెన్స్‌తో ఔరా అనిపించింది. భర్త వీక్‌నెస్‌ని ఆసరాగా చేసుకొని ఆమె చేసిన చిలిపి తమాషాలు ఈ సిరీస్‌కు హైలెట్‌.

ఈ వెబ్ సిరీస్‌కు మరో ప్రధాన బలం.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే పలు కామెడీ సన్నివేశాలను తనదైన స్పెషల్‌ బీజీఎంతో నవ్వులు పూయించాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోస్ జిమ్మీ. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు సిరీస్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. మొత్తంగా డీసెంట్ కామెడీ అండ్ రొమాంటిక్ యాంగిల్‌లో వచ్చిన ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో కలిసి చూస్తూ హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చు.

A REVIEW WRITTEN BY NVLR