Breaking News

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ

6 0

POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3.25/5

అమితాబ్, తాప్సీ నటించిన ‘పింక్’ తెలుగులో రీమేక్ అవుతుందంటే టాలీవుడ్ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అనగానే అదేంటి ‘పింక్’ కమర్షియల్ సినిమా కాదు కదా.. పవన్ ఇందులో ఏం చేస్తాడు అని విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ ‘వకీల్ సాబ్’ చూస్తే వారి నోళ్లు మూతపడక తప్పదు. మూడేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో పవన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. తన పర్ఫార్మెన్స్‌తో తన హార్డ్ కోర్ అభిమానులనే కాక మహిళా అభిమానులను కూడా అలరించాడు.

కథ విషయానికి వస్తే.. సామాన్యులకు న్యాయం చేయాలనే పట్టుదలతో సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) లాయర్ అవుతాడు. శ్రుతి హాసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితంలో కొన్ని ఘటన వల్ల లాయర్ వృత్తిని వదిలేస్తాడు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఏరియాకు షిఫ్ట్ అవుతాడు. అదే ఏరియాలో ఉంటున్న ముగ్గురు అమ్మాయిలు (నివేదా, అంజలి, అనన్య) ఎంపీ కొడుకును కొట్టి పారిపోతారు. దీంతో నివేదా(పల్లవి)ను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెడతారు. ముగ్గురు అమ్మాయిలకు హెల్ప్ చేసిన సత్యదేవ్‌ను ఎంపీ భయపెట్టాలని చూస్తాడు. దీంతో సీరియస్ అయిన సత్యదేవ్ నివేదా వాళ్ల కేసును టేకప్ చేస్తాడు. అసలు ఇంతకీ నివేదా బ్యాచ్ ఏం తప్పు చేశారు? సత్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ ఏంటో మిగతా కథ.

ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్. మూడు డిఫరెంట్ లుక్స్‌లో అద్భుతంగా నటించాడు. ఆయన మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. కాలేజీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, కోర్టు సీన్స్.. ఇలా ప్రతి సీన్‌లోనూ ఆయన నటన థ్రిల్ చేస్తుంది. శ్రుతి హాసన్‌ది చిన్న పాత్ర మాత్రమే. సినిమాకు కీలకమైన పాత్రలో నివేదా థామస్ నటన సూపర్బ్.‘మగువ’ పాటలో అయితే నివేదా నటన అభిమానుల కళ్లు చెమరుస్తుంది. కోర్టు సీన్‌లో అంజలి కూడా బాగా నటించింది. ఎంపీ కొడుకు తరఫున వాదించే లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా బాగానే చేసినా పవన్ నటన ముందు తేలిపోయాడు. అయితే ఫస్టాఫ్‌లో సినిమా అక్కడక్కడా నెమ్మదిగా సాగడం మైనస్ అనిపిస్తుంది.

‘వకీల్ సాబ్’ మూవీకి పవన్ కళ్యాణ్ తర్వాత రెండో ప్లస్ పాయింట్ దర్శకుడు వేణు శ్రీరామ్. ‘పింక్’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కమర్షియల్ తీయడానికి సాహసం ఉండాలి. వేణు శ్రీరామ్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక మూడో ప్లస్ పాయింట్ సంగీత దర్శకుడు తమన్. ముఖ్యంగా ‘మగువ’, ‘సత్యమేవ జయతే’ పాటలు చాలా బాగున్నాయి. అన్ని పాటలతో పాటు తమన్ బీజీఎం కూడా ఈ సినిమాకు ప్రాణం పోసింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా బాగుంది. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

చివరగా మూడేళ్ళుగా ఆకలి మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘వకీల్ సాబ్’ ఓ అద్భుతమైన విందు భోజనం అందిస్తుంది. కోర్టు సన్నివేశాల్లో కొన్ని సెటైరికల్ డైలాగులు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగుందనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడంటే అతిశయోక్తి కాదు. కొన్ని రెగ్యులర్ సీన్లు మినహాయిస్తే ‘వకీల్ సాబ్’ అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: విశ్వనాథ్ (కూకట్ పల్లి 4:30 AM)