ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఎన్నికల కోడ్‌కు సంబంధించి మినిమం నాలుగువారాలు కోడ్ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎస్ఈసీ పాటించలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీం ఆదేశాలతో కోడ్ విధించలేదని టీడీపీ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈనెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. 511 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుందనగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే హైకోర్టు తీర్పును ఎస్ఈసీ సవాల్ చేసే అవకాశం ఉంది. అంతకు ముందు టీడీపీ, బీజేపీ-జనసేన ఎన్నికలు వాయిదా వేయాలని వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించాయి. అయితే… బీజేపీ-జనసేన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చగా.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదన్న టీడీపీ పిటిషన్ వాదనలతో మాత్రం హైకోర్టు ఏకీభవించింది. బీజేపీ-జనసేన పాత నోటిఫికేషన్‌కు బదులుగా కొత్త నోటిఫికేషన్ దాఖలు చేయాలని కోరుతూ ఎన్నికల వాయిదాకు పట్టుబట్టింది.