ఏపీ తరహాలో తెలంగాణలో కూడా శాసనమండలి రద్దు చేయాలని తెలంగాణ యువసేన పార్టీ అధ్యక్షుడు అడప సురేందర్ డిమాండ్ చేశారు. ఆయన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగానూ పోటీ చేస్తుండటం గమనార్హం. 29 రాష్ట్రాలకు 23 రాష్ట్రాల్లో మండలి లేదని అడప సురేందర్ గుర్తు చేశారు. తెలంగాణలో శాసనమండలిని రద్దు చేయడం 40 మంది ఎమ్మెల్సీలకు నష్టం కావొచ్చని.. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం నష్టం కాదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు శాసన మండలి పునరావాస కేంద్రంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు లక్షల్లో జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని సురేందర్ సూటిగా ప్రశ్నించారు. తాను పైసా జీతం తీసుకోకుండానే ఆరేళ్లు పనిచేసేందుకు ముందుకు వచ్చానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల కోసం ఉద్యమిస్తానని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిని రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.