ఈ ఏడాది భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవిలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతాడని ఆయా రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సాధారణ పరిస్థితుల్లో ఉదయం నుంచి పెరిగే ఎండలు సాయంత్రానికి కాస్తంత ఉపశమనాన్ని ఇస్తాయని, కానీ ఈ ఏడాది సాయంత్రం సమయంలోనూ తీవ్రమైన ఉక్కపోతను అనుభవించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ఏడాది వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.