Breaking News

అతిపెద్ద స్టేడియం ‘మొతేరా’ ప్రత్యేకతలు ఏంటి?

0 0

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని మొతేరాలో బుధవారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య పింక్ బాల్ (డే/నైట్) టెస్టు జరగనుంది. అయితే ఈ స్టేడియం ప్రత్యేకతలు క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. పిల్లర్లు లేకుండా ఈ స్టేడియాన్ని నిర్మించారు. దీంతో స్టేడియంలోని ఏ మూల నుంచి అయినా ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ వీక్షించవచ్చు. దేశంలో ఎల్‌ఈడీ లైట్ల వెలుతురు వచ్చే ఏకైక స్టేడియం ఇదే. ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్లకు బదులు స్డేడియం పైకప్పుకే లైట్లు అమర్చారు. దీంతో స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేదు. ఈ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా 55 గదులు, రెస్టారెంట్లు, ఒలింపిక్ ప్రమాణాలతో స్విమ్మింగ్ ఫూల్, జిమ్, 3డీ థియేటర్‌తో క్లబ్ హౌస్, క్రికెట్ అకాడమీ, ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు కూడా ఉన్నాయి. ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ప్రపంచంలో ఏ క్రికెట్ మైదానంలోనూ ఇంతమంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించలేరు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని ఎంసీజీలో 1,00,124 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడటం రికార్డుగా ఉంది. దీనిని మన మొతేరా బద్దలు కొట్టనుంది.

బుధవారం నుంచి ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టు ఈ స్టేడియంలో జరిగే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. అయితే ఈ టెస్టులో పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది. సాధారణంగా పింక్ బాల్ టెస్టుల్లో పేసర్లు విజృంభిస్తుంటారు. మరి మొతేరాలోని పిచ్ పేస్‌కు సహకరిస్తుందో, స్పిన్‌కు సహకరిస్తుందో చూడాలి. పేసర్లకు సహకరించాలని ఇంగ్లండ్ జట్టు కోరుకుంటుంటే.. స్పిన్నర్లకు సహకారం అందాలని టీమిండియా భావిస్తోంది. ఈ టెస్టు అనంతరం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టీ20 మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. దీంతో వచ్చే నెలరోజుల పాటు మొతేరాలో క్రికెట్ సందడి నెలకొననుంది.