Breaking News

‘దృశ్యం-2’ మూవీ రివ్యూ

1 0

MOHANLAL DRISHYAM-2 MOVIE REVIEW

రేటింగ్: 3.5/5

సాధారణంగా సీక్వెల్ సినిమాలంటే ఏదో మొక్కబడిగా ఉంటాయి. కానీ ఆరేళ్ల కిందట వచ్చిన ‘దృశ్యం’ మూవీకి మలయాళంలో సీక్వెల్ తీస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. లాక్‌డౌన్ తర్వాత సుమారు రెండు నెలల్లోనే ఈ సినిమా తెరకెక్కి ఓటీటీలో విడుదలైంది. ‘దృశ్యం’తరహాలోనే ఈ నిఖార్సైన సీక్వెల్ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం.

కథ విషయానికొస్తే.. దృశ్యం మూవీ ఎక్కడ పూర్తయిందో అక్కడి నుంచి సీక్వెల్ మూవీ ప్రారంభం అవుతుంది. ఆరేళ్లు గడిచాక (‘దృశ్యం’ విడుదలై కూడా ఆరేళ్లు) జార్జికుట్టి (మోహన్‌లాల్) కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయో దర్శకుడు చూపించాడు. వరుణ్ మర్డర్ కేసులో జార్జికుట్టి కుటుంబాన్ని పోలీసులు వదిలేయకుండా రహస్యంగా విచారణ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుణ్‌ను తానే హత్య చేసినట్లు జార్జికుట్టి అంగీకరిస్తాడు. ఇక్కడి నుంచి కథలో వచ్చే ట్విస్టులు, సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి.

మోహన్‌లాల్‌ను గొప్ప నటుడు అని ఎందుకు అంటారో ‘దృశ్యం-2’ మరోసారి చాటిచెప్పింది. ఈ మూవీని ఒంటిచేత్తో అతడు విజయతీరాలకు చేర్చిన విధానం చూసి తీరాల్సిందే. ఎంతో పరిణితి గల జార్జికుట్టి పాత్రలో మోహన్‌లాల్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. జార్జికుట్టి భార్య పాత్రలో మీనా నటన కూడా బాగుంది. తొలి గంటలో సాధారణంగా ఉన్న కథ అనంతరం వచ్చే మలుపులతో ఇంట్రెస్టింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. ముఖ్యంగా చివరి అరగంట సినిమా చూస్తే దర్శకుడి పనితనం, ఆయన గొప్పతనం తెలిసిపోతాయి. ఏ అంచనాలు లేకుండా ‘దృశ్యం’ థ్రిల్ చేస్తే.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘దృశ్యం-2’అదరహో అనిపిస్తుంది.

రెండున్నర గంటల ఈ మూవీలో ఉన్నది ఒక్కటే పాట అయినా నేపథ్య సంగీతం అలరిస్తుంది. ఈ విషయంలో అనిల్ జాన్సన్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. సతీష్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి స్క్రీన్‌ప్లే అతిపెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండాఫ్‌లో జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభ బయటపడుతుంది. ఏదో గాలివాటం లాగా సీక్వెల్ తీయకుండా ఎంతో ఉన్నతంగా అతడు ఈ మూవీని తెరకెక్కించాడు. చివరికి జార్జి కుట్టి అనే పాత్ర పట్ల ప్రేక్షకులకు ఆరాధన భావం కలిగేలా అతడు ఈ సినిమాను ముగించడం అభినందనీయం.

ఫైనల్‌గా సీక్వెల్ సినిమాలంటేనే డబ్బుల కోసం తీసే సినిమాలు అని, క్రెడిట్ కోసం తీస్తారని ఓ ముద్ర పడిపోయింది. సూపర్ డూపర్ హిట్ మూవీ చంద్రముఖి సీక్వెల్ విషయంలో ఇలాగే చేతులు కాల్చుకున్న దాఖలాలు ఉన్నాయి. అందులోనూ ‘దృశ్యం-2’మూవీని హడావిడిగా తెరకెక్కించి ‘అమెజాన్ ప్రైమ్’ ఓటీటీలో విడుదల చేయడంతో అనుమానాలు రేకెత్తాయి. కానీ ఈ మూవీ చూశాక సీక్వెల్ సినిమాలంటే సినిమా ప్రియులకు ఉన్న చులకనభావన కచ్చితంగా తొలగిపోతుంది.

A REVIEW WRITTEN BY NVLR