Breaking News

అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ రివ్యూ

2 0

ALLARI NARESH NANDI MOVIE REVIEW

రేటింగ్: 2.75/5

అల్లరి నరేష్ ఇప్పటివరకు నటించిన 57 సినిమాల్లో ‘గమ్యం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మళ్లీ నరేష్ నుంచి నటన ఆ స్థాయిలో ‘నాంది’లో కనిపించింది. రొటీన్ కామెడీ సినిమాల నుంచి బయటకు వచ్చి నరేష్ ఇలాంటి సినిమాలు చేయడానికి ఈ చిత్రం నిస్సందేహంగా ‘నాంది’ పలుకుతుంది. ఈ సినిమాకు కథ, కొత్త పాయింట్ ప్రాణంగా, వెన్నుదన్నుగా నిలిచాయి. కథనం పకడ్బందీగా ఉండి ఉంటే ఈ సినిమా లెవల్ మరో స్థాయిలో ఉండేది.

కథ విషయానికొస్తే సూర్య (అల్లరి నరేష్) అనే యువకుడు తనకు తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో దారుణంగా శిక్షించబడతాడు. అయితే లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేస్తుంది. ఇంతకీ నరేష్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అసలు ఈ కేసులో అసలు దోషులు ఎవరు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.

విజయ్ ‘సర్కార్’ మూవీలో ప్రజలకు తెలియని కొత్త సెక్షన్ గురించి ఆ సినిమా దర్శకుడు చూపించాడు. ఈ మూవీలో కూడా దర్శకుడు విజయ్ కనకమేడల ఓ కొత్త పాయింట్‌ను (సెక్షన్ 211) ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కానీ ఆ పాయింట్ గురించి లోతుగా చర్చించకుండా కమర్షియల్ కోణంలోకి వెళ్లిపోవడం ఈ మూవీకి మైనస్. ఆరంభంలో సినిమాలో ఉన్న గ్రిప్ ఆ తర్వాత లేదు. కానీ నరేష్ నటన కొంతవరకు ఆ లోటును పూడ్చింది. మలయాళంలో వచ్చిన ‘వ్యూహం’ కథ కూడా ఇలాగే ఉంటుంది. ‘ఆహా’లో వచ్చిన ఈ సినిమాలో సన్నివేశాలను దర్శకుడు పకడ్బందీగా తీశాడు. ‘నాంది’లో అలాంటి స్క్రీన్‌ప్లే లేకపోవడం బలహీనతగా మారింది.

ముందే చెప్పుకున్నట్లు అల్లరి నరేష్ ఈ మూవీ కోసం చాలా బాగా నటించాడు. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. నరేష్ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర బాగుంది. హీరో స్నేహితుడిగా ప్రవీణ్ నటన కూడా ఫర్వాలేదు. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అబ్బూరి రవి మాటలు కొన్నిచోట్ల ఆలోచింపచేస్తాయి. అయితే దర్శకుడు కథనం విషయంలో మరింత దృష్టి పెడితే బాగుండేది.

ఓవరాల్‌గా ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్‌కు ప్లస్ అవుతుంది. సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లోనే సాగినా కొత్త పాయింట్ వల్ల ఈ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు. నరేష్ కోసం ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడవచ్చు. లో బడ్జెట్‌లోనే ఈ సినిమా తెరకెక్కడం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం అందుకునే అవకాశం ఉంది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: GSM ఐనాక్స్ (చందానగర్)